అప్పటివరకు.. ఆదివారం ఆ కుటుంబానికి ఎంతో సంతోషకరంగా గడిచింది. కూతురి ఎంగేజ్మెంట్కు వచ్చిన బంధువులు, స్నేహితులతో ఇల్లంతా సందడి.. పెళ్లికి సిద్ధమవుతున్న యువతి మోములో వెలుగు.. అదే ఆనందంలో కొత్తగా ప్రారంభించిన వంతెనను చూసేందుకు వెళ్లారు. అంతే.. కుటుంబంలో ఆనందాలు ఆవిరయ్యాయి. వధువు సహా ఆరుగురు రెప్పపాటులో ప్రాణాలు కోల్పోయారు.
గుజరాత్లోని మోర్బీ వంతెన కూలిన ఘటన.. మీరా కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు ప్రాణపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారమే మెహబూబాయి మీరా(19) ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత మీరా, మరికొందరు కుటుంబ సభ్యులు వంతెన చూసేందుకు వెళ్లారు. బ్రిడ్జి కుప్పకూలగా.. కాబోయే వధువు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మీరా(19), రుక్సానాబెన్ చౌహాన్(40), సానియాబెన్ చౌహాన్(18), రోషన్బెన్ పఠాన్(32), మహియా పఠాన్(6), దానిష్ పఠాన్(3)గా గుర్తించారు. తమకు న్యాయం జరగాలని బాధిత కుటుంబానికి చెందిన ఇమ్రాన్ సయ్యద్ డిమాండ్ చేస్తున్నారు. 'దీనికి ఎవరు బాధ్యులో మాకు తెలియదు. ప్రభుత్వమే వారిని గుర్తించాలి. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని చెబుతున్నారు.
"వివాహం ఎప్పుడు పెట్టుకోవాలని మేమంతా చర్చించుకుంటున్నాం. అప్పుడే మాకు ఫోన్ వచ్చింది. ఆరుగురు చనిపోయారని మాకు చెప్పారు. మా కుటుంబం ఇప్పుడు ఓదార్చలేని స్థితిలో ఉంది. 100-150 సామర్థ్యం ఉన్న వంతెనపైకి 500 మందిని పంపించారు. ఇలా చేస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయా? రిస్క్ గురించి తెలిసినా.. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇప్పుడేం చేయాలి? చనిపోయినవారిని ఎలా తీసుకురావాలి?"
-ఇమ్రాన్ సయ్యద్, బాధిత కుటుంబ సభ్యుడు