గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటన 'దేవుడు చేసిన చర్య' (యాక్ట్ ఆఫ్ గాడ్) అని తీగల బ్రిడ్జి మరమ్మతులు చేసిన ఒరేవా కంపెనీ మేనేజర్ వాదించారు. దేశాన్ని షాక్కు గురిచేసిన ఈ ప్రమాదానికి కారణం.. యాక్ట్ ఆఫ్ గాడ్ అని పేర్కొన్నారు. ఒరేవా కంపెనీ మేనేజర్ కోర్టులో ఈమేరకు వాదించినట్లు.. విచారణ ముగిసిన అనంతరం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హెచ్ ఎస్ పాంచల్ మీడియాకు తెలిపారు. 'ఒరేవా కంపెనీ ఇద్దరు మేనేజర్లలో ఒకరు ఈ ఘటనకు యాక్ట్ ఆఫ్ గాడ్ కారణమని చెప్పారు' అని వివరించారు పాంచల్. మరోవైపు, విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేబుల్ బ్రిడ్జి తీగలు పూర్తిగా తుప్పుపట్టిపోయినట్లు దర్యాప్తులో తేలింది. ప్రజల సందర్శనార్థం తెరిచేందుకు వంతెన అసలు సిద్ధంగానే లేదని న్యాయవాది హెచ్ఎస్ పాంచల్ తెలిపారు.
"వంతెన తీగలు తుప్పుపట్టాయని ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ నివేదికలో దర్యాప్తు అధికారి వెల్లడించారు. తీగలు చాలా పాతబడిపోయాయి. వంతెన ఫ్లోరింగ్ మార్చి.. తీగలను పట్టించుకోకుండా వదిలేశారు. వాటిని అసలు మార్చేయలేదు. తీగలకు కనీసం ఆయిల్/గ్రీజు వంటివి రాయలేదు. వంతెన మరమ్మతుల కోసం టెండరు ప్రక్రియ జరపలేదు. కాంట్రాక్టును నేరుగా కేటాయించారు."
-హెచ్ఎస్ పాంచల్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్