సామూహిక అత్యాచారానికి గురైన బాలిక.. రోడ్డుపై నగ్నంగా ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఉత్తర్‌ప్రదేశ్‌లో తీవ్ర దుమారం రేపింది. సెప్టెంబర్ 1న జరిగిన దారుణం ఈ వీడియోతో వెలుగులోకి రాగా.. పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఒకడ్ని అరెస్టు చేశారు. మొరాదాబాద్ జిల్లా భోజ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.
ఒంటరిగా ఉన్న బాలికను ఎత్తుకెళ్లి..
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలి వయసు 15 ఏళ్లు. సెప్టెంబర్ 1న పక్క గ్రామంలో జరుగుతున్న సంతకు వెళ్లింది. తిరిగి వస్తుండగా నితిన్, కపిల్, అజయ్, నాజియా అలీ, ఇమ్రాన్ కలిసి.. బాలికను ఓ నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లారు. ఆమెను వివస్త్రను చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సమీపంలోని పొలాల్లో పని చేసుకుంటున్నవారు.. బాధితురాలి అరుపులు విని, అటు వైపు వచ్చారు. వెంటనే నిందితులంతా అక్కడ నుంచి పారిపోయారు. బాధితురాలు అలానే నగ్నంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లి.. కుటుంబసభ్యులకు జరిగినదంతా చెప్పింది.
బాలిక నగ్నంగా నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను ఓ మహిళ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇది వైరల్ కాగా.. పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. అయితే.. ఫిర్యాదును స్వీకరించి, కేసు నమోదు చేసే విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే బాధితురాలు, కుటుంబం కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయలేదని కొందరు చెబుతున్నారు. వారం తర్వాత ఎస్ఎస్పీ హేమంత్ కుటియాల్ను కలవగా.. అప్పుడు కేసు పెట్టారని అంటున్నారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో మొరాదాబాద్ ఎస్పీ(గ్రామీణ) సందీప్ కుమార్ మీనా మంగళవారం రాత్రి వివరణ ఇచ్చారు. "తన మేనకోడలిపై అత్యాచారం జరిగిందని ఓ వ్యక్తి సెప్టెంబర్ 7న ఫిర్యాదు చేశాడు. మేము దర్యాప్తు ప్రారంభించాం. కానీ.. అలాంటిదేమీ లేదని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. అయినా మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఒక నిందితుడ్ని అరెస్టు చేశాం." అని స్పష్టం చేశారు.