తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జైలులో ఘర్షణ.. సింగర్ మూసేవాలా హత్య కేసు నిందితులు మృతి

సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు జైలులో మృతి చెందారు. ఓ ఘర్షణలో వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు.

moosewala-murder-case-accused-gangsters-killed
moosewala-murder-case-accused-gangsters-killed

By

Published : Feb 26, 2023, 7:50 PM IST

పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అరెస్టైన ఇద్దరు గ్యాంగ్​స్టర్లు.. జైలులో చెలరేగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయారు. నిందితులు ప్రస్తుతం పంజాబ్​ తరన్ తారన్ జిల్లాలోని గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ ఉన్నారు. ఘర్షణలో మరో ఖైదీకి గాయాలయ్యాయని సీనియర్ ఎస్పీ గుర్మీత్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. వీరు ముగ్గురూ ఒకే వర్గానికి చెందినవారని చెప్పారు. మృతులపై ఇతర కేసులు సైతం ఉన్నాయని తెలిపారు. మృతులను బటాలాకు చెందిన మన్​దీప్ సింగ్ అలియాస్ తుఫాన్, బుఢ్​లాడాకు చెందిన మన్మోహన్ సింగ్ అలియాస్ మోహ్నాగా గుర్తించారు.

తీవ్రంగా గాయపడ్డ కేశవ్ అనే ఖైదీని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడికి తరన్ తారన్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు. కేశవ్ ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అతడిని సైతం సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనే అరెస్టు చేసినట్లు చెప్పారు. ఏదో విషయంపై ఖైదీల మధ్య వివాదం ప్రారంభమైందని పోలీసు వర్గాలు తెలిపాయి. క్రమంగా ఇది ఘర్షణకు దారితీసిందని వెల్లడించాయి. ఐరన్ రాడ్​లు, ఇతర పాత్రలను ఉపయోగించి దాడులు చేసుకున్నారని చెప్పాయి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గొడవ మొదలైనట్లు సమాచారం.

పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా

2022 మే 29న సిద్ధూ మూసేవాలాపై దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి హత్య చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ హత్యకు తామే బాధ్యులమని ప్రకటించుకుంది. సిద్ధూ మూసేవాలా హత్య జరిగిన సమయంలో మన్​దీప్ తుఫాన్ అక్కడే ఉన్నాడు. స్టాండ్​బై షూటర్​గా అతడిని తీసుకెళ్లారు. సిద్ధూ మూసేవాలాపై కాల్పులు జరిపిన జగ్​రూప్, మన్​ప్రీత్ మన్నూ వెంట ఉన్నాడు. రెక్కీలు నిర్వహిస్తూ ఆ సమాచారాన్ని కెనడాలో ఉన్న గోల్డీ బ్రార్​కు పంపేవాడు మన్​ప్రీత్. ఈ సమాచారంతోనే గోల్డీ బ్రార్.. సిద్ధూ మూసేవాలా హత్యకు ప్లాన్ వేశాడు. మూసేవాలా హత్య అనంతరం.. మన్​ప్రీత్, మన్మోహన్​ ఇద్దరూ అండర్​గ్రౌండ్​కు వెళ్లిపోయారు. లూధియానాకు చెందిన సందీప్ అనే వ్యక్తి వీరిద్దరికీ ఆశ్రయం ఇచ్చాడు. చివరకు సందీప్ పోలీసులకు పట్టుబడగా.. మన్​ప్రీత్, మన్మోహన్​ సైతం దొరికిపోయారు.

ABOUT THE AUTHOR

...view details