IMD Monsoon: నైరుతి రుతుపవనాలు సాధారణంగానే పురోగమిస్తున్నాయని, రాబోయే రెండు రోజుల్లో మహారాష్ట్రను తాకుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. మే 31- జూన్ 7 మధ్య దక్షిణ, మధ్య అరేబియా మహాసముద్రం, కేరళ మొత్తం సహా కర్ణాటక, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఆర్కే. జేనామణి తెలిపారు. ఇదే సమయంలో ఈశాన్య భారతదేశం మొత్తం మంచి వర్షపాతం నమోదైందని స్పష్టం చేశారు.
''రుతుపవనాల రాకలో ఎలాంటి జాప్యం లేదు. రాబోయే రెండు రోజుల్లో మహారాష్ట్రలోకి ప్రవేశిస్తాయి. తర్వాత రెండు రోజుల్లో ముంబయిలోనూ వర్షాలు పడొచ్చు.''
- జేనామణి, ఐఎండీ శాస్త్రవేత్త
ఈసారి నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు బాగా కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు జేనామణి. మరో రెండు రోజుల్లో బలమైన గాలులు వీయడం, మేఘాలు దట్టంగా కమ్ముకోవడం చూస్తామని పేర్కొన్నారు. గోవా, మహారాష్ట్రల్లోని ఇతర ప్రాంతాలు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో.. రెండు రోజుల్లో రుతుపవనాల్లో పురోగతి కనిపిస్తుందని ఆయన అంచనా వేశారు.
నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్తముందే పలకరించాయి. సాధారణంగా జూన్ ఒకటిన కేరళలో ప్రవేశించే 'నైరుతి' మూడు రోజుల ముందుగానే వచ్చేసిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. మే 29న కేరళను రుతుపవనాలు తాకినట్లు వాతావరణ విభాగ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. అక్కడే స్థిరంగా ఉండి 4 రోజులకు కర్ణాటక, తమిళనాడును తాకాయని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:వర్షాలపై ఐఎండీ చల్లని కబురు.. ఈసారి దంచికొట్టుడే!
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు