ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. వచ్చే వర్షాకాలంలో అధిక వర్షపాతం నమోదు కావడానికి అవకాశాలు లేవని తెలిపింది. ఇలా జరగడానికి మొదటి కారణం ఎల్ నినో అని పేర్కొంది. ట్రిపుల్-డిప్-లా నినా (భూమద్ధ రేఖ వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలంపై సంవత్సరాల పాటు చల్ల బడడం. ఇది కరవు, విపరీతమైన గాలులు, భారీ వర్షాలకు కారణమవుతుంది) కారణంగా.. నైరుతి రుతుపవనాల వల్ల.. గత నాలుగు సీజన్లలో సాధారణ లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని స్కైమెట్ మేనేజింగ్ డైరెక్టర్ జతిన్ సింగ్ తెలిపారు. ఇప్పుడు లా నినా ముగిసిందని.. ఎల్ నినో ప్రభావం ఎక్కువైందని చెప్పారు. ఇలా.. ఎల్ నినో ప్రభావం పెరిగితే రుతుపవనాలు బలహీన పడి తక్కువ వర్షపాతం నమోదవుతందని తెలిపారు.
వర్షపాతం తగ్గడానికి మరో కారణం ఐఓడీ (ఇండియన్ ఓషియన్ డైపోల్). దీన్ని ఇండియన్ నినో అని కూడా అంటారు. దీని వల్ల వర్షాకాలంలో నెలవారీ వర్షపాతంలో వైరుద్ధ్యం ఏర్పడుతుందని స్కైమెట్ పేర్కొంది. దీని కారణంగా ఉత్తరాదిలో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని అంచనా వేసింది. జులై, ఆగస్టు నెలల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో సాధారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో సీజన్ రెండో భాగంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.