తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మంకీపాక్స్​పై ఆందోళన వద్దు.. వ్యాక్సిన్​పైనా ముందడుగు'

MONKEYPOX MANDAVIYA ADVICE: మంకీపాక్స్ విషయంలో దేశ ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. వైరస్ కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేశామన్న మంత్రి.. వ్యాక్సిన్ విషయంలోనూ చకచకా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.

By

Published : Aug 2, 2022, 3:20 PM IST

MANDAVIYA MONKEYPOX
MANDAVIYA MONKEYPOX

Monkeypox Mansukh mandaviya: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ.. దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. వైరస్​​పై రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో మాట్లాడిన ఆయన.. పౌరులెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

"మంకీపాక్స్ వంటి వ్యాధుల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ఇప్పటికే కేంద్రం తరఫున నీతి ఆయోగ్ సభ్యుడి నేతృత్వంలో టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేశాం. టాస్క్​ఫోర్స్ అధ్యయనం చేసిన తర్వాత వారి సలహాలు స్వీకరించి.. తర్వాతి చర్యలు తీసుకుంటాం. కేరళ ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా.. తప్పకుండా చేస్తాం. ఈ విషయంపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మార్గదర్శనం చేస్తోంది.''

-మన్​సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య మంత్రి

MANDAVIYA MONKEYPOX ADVICE:'ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు రావడం ప్రారంభమైనప్పటి నుంచే ముందుజాగ్రత్తలు మొదలుపెట్టాం. కేరళలో తొలి కేసు రావడానికి ముందే మార్గదర్శకాలు విడుదల చేశాం. ప్రయాణికుల స్క్రీనింగ్ రిపోర్టులను సంబంధిత అధికారులకు పంపించాలని విదేశీ ప్రభుత్వాలను కోరాం. ఈ వ్యాధి కొత్తదేం కాదు. 1970ల నుంచి ఆఫ్రికాలో కేసులు నమోదవుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. దేశంలో కూడా పర్యవేక్షణ ప్రారంభమైంది. నిరంతర నిఘాతో వ్యాధిని అదుపులో ఉంచొచ్చు' అని మాండవీయ పేర్కొన్నారు.

వ్యాక్సిన్​పై..
మంకీపాక్స్ కట్టడికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ఐసీఎంఆర్ సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. తొలిసారి వైరస్ స్ట్రెయిన్​ను మంకీపాక్స్ నుంచి ఐసీఎంఆర్ వేరు చేసినట్లు చెప్పారు. దీన్ని వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం ప్రతిపాదనలు సైతం పంపామని వివరించారు.

దేశంలో వరుసగా మంకీపాక్స్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. దిల్లీలో సోమవారం ఓ నైజీరియా వాసికి వైరస్ పాజిటివ్​గా తేలింది. ఒక్క కేరళలోనే మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. బుధవారం కేరళలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు, దిల్లీలో మంకీపాక్స్ సోకిన తొలి వ్యక్తి కోలుకున్నాడు.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. దేశంలో మంకీపాక్స్‌ కేసుల పర్యవేక్షణ, కట్టడి కోసం ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ ఈ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతోపాటు దేశంలోని ప్రధాన వైద్య, పరిశోధనా సంస్థల ప్రతినిధులూ సభ్యులుగా ఉంటారని తెలిపాయి. వైరస్‌ నిర్ధరణ, చికిత్సలకు సంబంధించి వసతుల విస్తరణ, అవసరమైన ఏర్పాట్లు, వ్యాక్సిన్‌ తయారీ తదితర అంశాలపై ఈ టాస్క్‌ఫోర్స్‌ సూచనలు చేస్తుంది. 'దేశంలో మంకీపాక్స్ కేసుల నిర్వహణలో ఈ టాస్క్‌ఫోర్స్‌ సహాయపడుతుంది. ఆయా రాష్ట్రాల్లో నమోదయ్యే కేసులను సమన్వయం చేస్తుంది. అవసరమైతే సూచనలు జారీ చేస్తుంది' అని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details