Monkey Pox Virus Central Govt Orders: మంకీపాక్స్ ఒక్క కేసు నమోదైనా.. తీవ్రంగానే పరిగణించి చర్యలు చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం స్పష్టం చేసింది. వివిధ దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం మార్గదర్శకాలిచ్చింది. కేసు బయటపడిన జిల్లాల్లో సమగ్ర పరిశోధన జరపాలని సూచించింది. కొత్త కేసులను, క్లస్టర్లను సత్వరం గుర్తించేందుకు నిఘా ఉంచాలని తెలిపింది.
వ్యాధి నియంత్రణకు.. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిచెందే ముప్పును తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని వివరించింది. దేశంలో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కానప్పటికీ అప్రమత్తంగానే ఉండాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలనూ తెలియజేసింది. వివరాలివీ..
- కేసులు బయటపడితే తగిన చికిత్సలు అందించేందుకు.. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు దీనిబారిన పడకుండా చూసేందుకు చర్యలు చేపట్టాలి. వ్యాధి మూలాలను కనుక్కోవాలి. అవసరమైన వారిని వేరుగా ఉంచేందుకు (ఐసొలేషన్‌కు) ఏర్పాట్లు చేయాలి.
- అధీకృత ల్యాబొరేటరీల్లో నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే మంకీపాక్స్ కేసుగా పరిగణించాలి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలి.
- ఎలుకలు, ఉడతలు, కోతులు, వానర జాతి జంతువులు వంటివి కరవడం, రక్కడం ద్వారా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. మంకీపాక్స్ ఇంకుబేషన్ సమయం సాధారణంగా 6-13 రోజులు. ఒక్కోసారి 5-21 రోజుల మధ్య కూడా ఉండొచ్చు. ఈ వ్యాధి మరణాల రేటు 0 నుంచి 11 శాతం దాకా ఉండే అవకాశం ఉంది. పిల్లలకు వ్యాధి ముప్పు ఎక్కువ.
- ఎవరైనా వ్యాధి సోకిన దేశాల నుంచి వస్తే 21 రోజుల్లోపు వారిలో లక్షణాలు (జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం, లింఫ్‌నోడ్ల వాపు) కనిపిస్తే 'అనుమానిత కేసు'గా భావించాలి.
అంతర్జాతీయ ప్రయాణికులకు..
విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకూ కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ సూచనలు చేసింది. మృత లేదా సజీవంగా ఉన్న జంతువులకు దగ్గరగా వెళ్లొద్దని, ఈమేరకు ఎలుకలు, ఉడతలు, కోతులు, వానర జాతి జంతువులు వంటివాటికి దూరంగా ఉండాలని తెలిపింది. అనారోగ్యం బారినపడినవారు వినియోగించిన దుస్తులు, పడకలు, ఆరోగ్య పరికరాలు వంటివాటికి కూడా దూరంగా ఉండాలని సూచించింది. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, వన్యప్రాణుల మాంసాలను తినవద్దని స్పష్టం చేసింది.