ప్రయాణికులను కోతుల బెడద నుంచి తప్పించేందుకు లఖ్‌నవూ మెట్రో (Lucknow Metro news) అధికారులు వినూత్నంగా ఆలోచించారు. కోతులు ఎక్కువగా తిరుగుతున్న ప్రదేశాల్లో కొండముచ్చుల కటౌట్లను ఏర్పాటు చేశారు. వీటిని చూసి కోతులు భయపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
మెట్రో స్టేషన్లో కొండముచ్చు కటౌట్ ఇటీవల లఖ్‌నవూ మెట్రో స్టేషన్లో (Lucknow Metro news) వానరాల సంచారం పెరిగిపోయింది. కోతిచేష్టలతో ప్రయాణికులను ఇవి విసిగిస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతులు అందాయి. కోతులు దాడి చేసే ప్రమాదం కూడా ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ వినూత్న ఆలోచన అమలు చేశారు. మొత్తం తొమ్మిది స్టేషన్లలో కొండముచ్చుల కటౌట్లను నెలకొల్పారు.
మెట్రో స్టేషన్లో కొండముచ్చు కటౌట్ ఫలించని సౌండ్లు..
కటౌట్లు నెలకొల్పే ముందు ఇతర ప్రయత్నాలు కూడా చేశారు ఇక్కడి అధికారులు. కోతులను బెదరగొట్టేందుకు కోపంతో ఉన్న కొండముచ్చుల అరుపులను ప్లే చేశారు. ఇది ప్రారంభంలో కొంతవరకు ఫలించింది. కానీ, తర్వాత కోతులు ఈ విషయాన్ని గుర్తించాయి. స్టేషన్లో కొండముచ్చులు లేవని గ్రహించాయి. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.
దీంతో ఇప్పుడు కొండముచ్చుల కటౌట్లను ఏర్పాటు చేసి వాటి సౌండ్లను ప్లే చేస్తున్నారు. ఈ ప్రయత్నం చాలా వరకు ఫలించిందని, ప్రస్తుతం కోతులు స్టేషన్ దరిదాపుల్లోకి రావడం లేదని ఓ అధికారి చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఈ కటౌట్లను ఒక్కచోటే ఉంచితే నకిలీవి అని కోతులు గుర్తించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. కొద్దిరోజుల తర్వాత మార్చేస్తున్నారు.
ఇదీ చదవండి:కాన్పుర్‌లో జికా కలకలం- కొత్తగా ఆరు కేసులు