monkey fever in karnataka: కర్ణాటక శివమొగ్గ జిల్లాలో అరుదైన మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. ఈ వ్యాధి సోకి ఈనెల 3వ తేదీన సాగర్ తాలుకా అరళగోడ్కు చెందిన రామస్వామి కరమానే(55) మృతి చెందారు. దీంతో జిల్లావ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్‌లోనూ ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపుర్ తాలుకాలో మంకీ ఫీవర్‌తో 85 ఏళ్ల ఓ మహిళ చనిపోయింది.
మంకీ ఫీవర్‌ను క్యాసనుర్ ఫారెస్ట్ డిసీస్(కేఎఫ్‌డీ) అని అంటారు. దీనిని 1957లో తొలిసారి శివమొగ్గ జిల్లాలోని క్యాసనుర్లో గుర్తించారు. ఇది కోతుల నుంచి మనుషులకు వ్యాపింస్తుండటం వల్ల మంకీ ఫీవర్‌గా పిలుస్తారు. కోతులకు ఉండే టిక్-బార్న్(గోమార్లు) మనుషులను కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. టిక్స్ ఎక్కువగా నెమళ్లు, పక్షులు, కుందేళ్లు, కోతుల్లో కనిపిస్తుంటాయి. కోతి చనిపోతే.. వాటికి రక్తం అందదు. అక్కడి నుంచి బయటకు వచ్చి మరో జీవిపైకి చేరతాయి. మనిషిని కరిస్తే జ్వరం, జలుబు వంటి అనారోగ్యాలు వస్తాయి. దానిని నిర్లక్ష్యం చేస్తే మరణం కూడా సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
మంకీ ఫీవర్ లక్షణాలు:గోమార్లు కుట్టిన కొన్ని రోజుల్లోనే జ్వరం వస్తుంది. తీవ్రమైన జ్వరం, నీరసం, ఆహారం తీసుకోవాలని అనిపించకపోవటం వంటి లక్షణాలు తొలి వారంలో కనిపిస్తాయి. రెండో వారంలో కళ్లు ఎర్రగా మారటం, జ్వరం మరింత పెరగటం, కళ్ల నుంచి రక్తం రావటం వంటివి జరుగుతాయి. శరీరంలోని ఇతర అవయవాలు సైతం దెబ్బతింటాయి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.