ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో దారుణం జరిగింది. సరయూ ఘాట్‌లో ఓ సాధువు తన చేతిని పదునైన ఆయుధంతో కోసుకున్నాడు. సాధువును ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సోమవారం ఉదయం జరిగిందీ ఘటన. సాధువును విమల్ కుమార్‌గా గుర్తించారు పోలీసులు. ఆయన స్వస్థలం బిహార్‌లోని ఆరారియా.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధువు జేబులో ఓ లెటర్ ఉంది. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు ఉంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకం సహా పలు పథకాల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆ లేఖలో ఉంది. అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. సాధువు బందువులకు పోలీసులు సమాచారం అందించారు. ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరగడం వల్లే విమల్ కుమార్.. అసంతృత్తికి లోనై చేతిని కోసుకున్నాడని పోలీసులు తెలిపారు. బాధితుడి మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.