తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడో రోజు రాహుల్​ను 9 గంటలు ప్రశ్నించిన ఈడీ.. నాలుగో రోజూ రావాలని సమన్లు - Rahul Gandhi money laundering case

Rahul ED: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని నాలుగో రోజు కూడా విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. మూడో రోజు 9 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది.

Rahul Gandhi
మూడో రోజు రాహుల్​ను 9 గంటలు ప్రశ్నించిన ఈడీ

By

Published : Jun 15, 2022, 9:57 PM IST

Rahul Gandhi: నేషనర్​ హెరాల్డ్ మనీలాండరింగ్​ కేసు మూడో రోజు విచారణలో భాగంగా రాహుల్​ గాంధీని బుధవారం 9 గంటల పాటు ప్రశ్నించింది ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్. నాలుగో రోజు కూడా విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. దీంతో గురువారం మరోమారు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు రాహుల్.
మూడో రోజు విచారణలో.. యంగ్‌ ఇండియన్‌ సంస్థ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని రాహుల్​ చెప్పినట్లు సమాచారం. యంగ్‌ ఇండియన్‌ లిమిటెడ్‌ (వైఐఎల్‌) లాభాపేక్షలేని దాతృసంస్థ అని.. అది కంపెనీల చట్టంలోని ప్రత్యేక నిబంధన కింద ఏర్పడిందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీ వాదనను ఈడీ అధికారులు తోసిపుచ్చుతూ.. ‘2010లో యంగ్‌ ఇండియా లిమిటెడ్‌ ఏర్పడినప్పటి నుండి ఎలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టలేదు’ అని పేర్కొన్నట్లు సమాచారం. యంగ్ ఇండియన్ ద్వారా ధార్మిక పని చేసి ఉంటే.. అందుకు సంబంధించిన పత్రాలు లేదా ఆధారాలు సమర్పించాలని అధికారులు రాహుల్ గాంధీని కోరినట్లు వర్గాలు పేర్కొన్నాయి. అలాగే రాహుల్​ను అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ షేర్లకు సంబంధించి వివరాలపై కూడా ఈడీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.

ఇదీ కేసు..
నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) ప్రచురణకర్తగా ఉంది. రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ సహా కొందరు కాంగ్రెస్‌ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దానికి యాజమాన్య సంస్థ. యంగ్‌ ఇండియన్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాంగ్రెస్‌కు ఏజేఎల్‌ బకాయి పడ్డ రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును కేవలం రూ.50 లక్షలు చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవాలని సోనియా, రాహుల్‌ తదితరులు కుట్ర పన్నినట్లు భాజపా నేత సుబ్రమణ్యస్వామి 2013లో ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details