కర్ణాటకలో అసెంబ్లీ విధాన్సభ గేట్ వద్ద భారీ మొత్తంలో నగదును పోలీసులు పట్టుకున్నారు. ప్రజాపనుల శాఖ జూనియర్ ఇంజినీర్ జగదీశ్ బ్యాగ్లో రూ.10 లక్షలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం బసవరాజ్ బొమ్మై ప్రతిపక్షాలపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
"ఓ ఇంజనీర్ భారీ మొత్తంలో నగదును తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించి.. అతడిని పట్టుకున్నారు. అతడు నగదును ఎవరికోసం ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని కచ్చితంగా శిక్షిస్తాం. అయితే ఈ విషయంలో అవినీతి జరుగుతోందని మాపై రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకుముందు పుట్టరంగశెట్టి కార్యాలయంలో రూ.25 లక్షలు దొరికినప్పుడు అధికారంలో ఉన్న ఆయన ఏం చర్యలు తీసుకున్నారు? నగదును తీసుకెళ్తున్నవారిని, తీసుకున్నవారిని పట్టుకున్నారా? మంత్రిని సస్పెండ్ చేశారా? ఈ విషయం గురించి ఆయన మర్చిపోయినట్లున్నారు. అందుకే మాపై ఆరోపణలు చేస్తున్నారు. బహుశా ఆయనకు మతిమరుపు ఉండవచ్చు. రూ.10 లక్షల నగదులో 40శాతం వాటా మాకు ఉంటే.. రూ.25 లక్షలు దొరికిన సమయంలో ఆయన వాటా ఎంత?"