"కరోనాతో మే 16న అమ్మ చనిపోయింది. తన వద్ద ఉన్న ఫోన్ను ఎవరో ఎత్తుకెళ్లారు. మా అమ్మ జ్ఞాపకాలు అందులో ఉన్నాయి. దానిని ఎవరైనా తీసుకున్నా.. దొరికినా.. దయచేసి ఈ అనాథకు ఇవ్వండి."
ఓ చిన్నారి తన తల్లి జ్ఞాపకాల కోసం పరితపిస్తూ.. జిల్లా పాలనాధికారి, పోలీసులు, ఎమ్మెల్యేకు రాసిన లేఖలోని ఆవేదన. కర్ణాటక కొడగు జిల్లాలో జరిగింది ఈ సంఘటన. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
దయచేసి తెచ్చివ్వండి..
గుమ్మనకొల్లికి చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి కూతురు హృతీక్ష ఈ లేఖ రాసింది. "15 రోజుల క్రితం.. అమ్మా నాన్న, నేను కరోనా బారిన పడ్డాం. దీంతో అమ్మ మడికేరి ఆస్పత్రిలో చేరింది. నాన్న, నేను ఇంట్లోనే పొరుగువారి సహకారంతో క్వారంటైన్లో ఉన్నాం. మే 16న అమ్మ చనిపోయింది. తన వద్ద ఉన్న ఫోన్ను ఎవరో ఎత్తుకెళ్లారు. మా అమ్మ జ్ఞాపకాలు అందులో ఉన్నాయి. దానిని ఎవరైనా తీసుకున్నా.. దొరికినా.. దయచేసి ఈ అనాథకు ఇవ్వండి." అని లేఖలో విజ్ఞప్తి చేసింది చిన్నారి.
ఈ లేఖపై జిల్లా కలెక్టర్ స్పందించారు. వీలైనంత త్వరగా ఆ ఫోన్ను గుర్తించి, అప్పగించేందుకు ప్రయత్నిస్తానని చిన్నారికి హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:కరోనాతో గర్భిణీ వైద్యురాలు మృతి