Mohan Bhagwat On Manipur :మణిపుర్‌లో ఒక్కసారిగా హింస ఎలా చెలరేగిందని ప్రశ్నించారు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్. ఇందులో విదేశీ శక్తుల ప్రమేయం ఏమైనా ఉందా? అని సందేహం వ్యక్తం చేశారు. మణిపుర్‌లో అనేక ఏళ్లుగా మెయితీలు, కుకీలు కలిసిమెలసి ఉంటున్నారని.. అక్కడ హింస జరగడం లేదని.. జరిగేలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితులు విదేశీ శక్తులకే మేలు చేస్తాయన్నారు. దసరాను పురస్కరించుకుని నాగ్‌పుర్‌లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో విజయదశమి ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న మోహన్ భాగవత్.. అనంతరం ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కొంతమంది సంఘ వ్యతిరేక వ్యక్తులు తమను తాము సాంస్కృతిక మార్క్సిస్టులుగా చెప్పుకొంటున్నారన్నారు మోహన్ భాగవత్. అయితే, వారు మార్క్స్‌ను మరచిపోయారని వ్యాఖ్యానించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు.. భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దేశ ఐక్యత, సమగ్రత, గుర్తింపు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని మోహన్ భాగవత్ విజ్ఞప్తి చేశారు. మణిపుర్‌లో శాంతి నెలకోల్పేందుకు సంఘ్ కార్యకర్తలు పనిచేశారన్నారు మోహన్ భాగవత్. ఒక సంఘ కార్యకర్తగా తాను గర్విస్తున్నట్లు పేర్కొన్నారు.
సమస్యల నుంచి బయటపడేందుకు ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. ఇటీవలి భారత్‌లో జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు.. దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు. 2024 జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహా ప్రతిష్ట జరుగుతుందన్నారు మోహన్ భాగవత్. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.