తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మసీదుకు RSS అధినేత.. 'ఇమామ్'​తో కీలక భేటీ.. అజెండా అదే! - మదర్సాను సందర్శించిన మోహన్ భగవత్

దిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్​ మసీదు.. అత్యంత అరుదైన భేటీకి వేదికైంది. ఆర్​ఎస్​ఎస్​ కీలక నేతలతో కలిసి మసీదుకు వెళ్లిన ఆ సంస్థ సారథి మోహన్ భగవత్.. అఖిల భారత ఇమామ్​ల సంఘం అధినేత ఉమర్​ అహ్మద్ ఇల్యాసీతో సమావేశమయ్యారు. గంటపాటు వేర్వేరు అంశాలపై చర్చించారు.

mohan bhagwat ilyasi meet
మసీదుకు RSS అధినేత.. 'ఇమామ్'​తో కీలక భేటీ.. అజెండా అదే!

By

Published : Sep 22, 2022, 3:39 PM IST

Updated : Sep 22, 2022, 3:49 PM IST

Mohan Bhagwat Ilyasi meet : అఖిల భారత్ ఇమామ్​ల సంఘం అధినేత ఉమర్​ అహ్మద్​ ఇల్యాసీతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సారథి మోహన్ భగవత్​ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. గురువారం ఉదయం దిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్​ మసీదుకు వెళ్లారు భగవత్. అక్కడున్న అఖిల భారత ఇమామ్​ల సంఘం కార్యాలయంలో ఇల్యాసీతో సమావేశమయ్యారు. ఆర్​ఎస్​ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి కృష్ణ గోపాల్, సీనియర్ నేత రామ్ లాల్, ముస్లిం రాష్ట్రీయ మంచ్ నేత ఇంద్రేశ్ కుమార్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. వీరంతా కలిసి గంటపాటు ఇల్యాసీతో చర్చలు జరిపారు.

Mohan Bhagwat mosque : "మా ఆహ్వానం మేరకు మోహన్ భగవత్ మదర్సాను సందర్శించారు. అక్కడి పిల్లలతో మాట్లాడారు. మోహన్ భగవత్.. జాతి పిత. అన్నింటికన్నా దేశమే ముందు అనేదే మా అందరి సిద్ధాంతం. మన అందరి డీఎన్​ఏ ఒక్కటే. దేవుడ్ని ఆరాధించే పద్ధతులే వేరు" అని ఆర్​ఎస్​ఎస్​ నేతలతో భేటీ అనంతరం మీడియాతో అన్నారు ఇల్యాసీ.

"మేము ఆహ్వానించగానే మా తండ్రి వర్ధంతి నాడు భగవత్ రావడం గొప్ప విషయం. ఇది దేశానికి మంచి సందేశం పంపుతుంది" అని సమావేశం అనంతరం చెప్పారు ఉమర్ ఇహ్మద్ ఇల్యాసీ సోదరుడు సుహేబ్ ఇల్యాసీ. "అన్ని రంగాల వ్యక్తులతో ఆర్​ఎస్​ఎస్​ అధినేత సమావేశం అవుతూ ఉంటారు. సాధారణ 'సంవాద్' ప్రక్రియలో ఇది భాగం" అని అన్నారు ఆర్​ఎస్​ఎస్​ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్.

దేశంలో మత సామరస్యం పెంపే లక్ష్యంగా కొంతకాలంగా ముస్లిం మేధావులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు మోహన్ భగవత్. దిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్​ నజీబ్ జంగ్, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్​వై ఖురేషి, అలీగఢ్​ ముస్లిం యూనివర్సిటీ మాజీ ఉపకులపతి లెఫ్టినెంట్ జనరల్ జమీర్ ఉద్దీన్​ షా, మాజీ ఎంపీ షాహిద్ సిద్దిఖీ, వ్యాపారవేత్త సయీద్ షేర్వానీతో ఇటీవల భేటీ అయ్యారు భగవత్. పర మతస్థులను ఉద్దేశించి కొన్ని పదాలు వాడడంపై ఇరు వర్గాలు ఈ సమావేశంలో తమ అభ్యంతరాలను వెలిబుచ్చాయి. అయితే.. హిందువులు, ముస్లింల డీఎన్​ఏ ఒక్కటేనని ఈ సందర్భంగా మోహన్ భగవత్ అన్నారు.

ఆ భేటీలకు కొనసాగింపుగా.. గురువారం ఉమర్​ ఇల్యాసీతో చర్చలు జరిపారు ఆర్​ఎస్​ఎస్​ అధినేత. ఇల్యాసీ నేతృత్వంలోని అఖిల భారత ఇమామ్​ల సంఘాన్ని.. ప్రపంచంలోనే అతిపెద్ద ఇమామ్​ల సంస్థగా చెబుతారు. ఇమామ్​ల ఆదాయం, సమాజంలో వారి హోదా, వారిపై సమాజం, ప్రభుత్వం పెట్టుకున్న ఆశలు సహా సంబంధిత సామాజిక-ఆర్థిక సమస్యలన్నింటి పరిష్కారం కోసం ఈ సంఘం ఏర్పడింది.

Last Updated : Sep 22, 2022, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details