Mohammad Akbar Lone Centre : 2018లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో ఎన్సీ పార్టీ నేత మహ్మద్ అక్బర్ లోన్.. 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ నినాదాలను చేసినందుకు.. తాను భారత రాజ్యాంగానికి విధేయత చూపుతున్నట్లు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తున్నట్లు కూడా అందులో పేర్కొనాలని తెలిపింది.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేసిన వారిలో ప్రధాన పిటిషనర్ అయిన అక్బర్ లోన్.. మంగళవారంలోగా అఫిడవిట్ దాఖలు చేస్తారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం కోరినట్లు అఫిడవిట్ దాఖలు చేయకపోతే.. అక్బర్ లోన్ తరఫున తాను వాదించనని సిబల్ స్పష్టం చేశారు.
అంతకుముందు.. 2018లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో 'పాకిస్థాన్ జిందాబాద్' అని నినదించినందుకు కేంద్రానికి అక్బర్ లోన్ క్షమాపణ చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీజేఐ ధర్మాసనం ముందు వాదించారు. రాజ్యాంగానికి అక్బర్ లోన్.. విధేయత చూపుతున్నట్లు ప్రకటించాల్సి ఉందని మెహతా చెప్పారు. సభా వేదికపై అలా నినాదాలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలన్నారు.
అయితే అక్బర్ తరఫున వాదనలు వినే సమయంలో ఆయన నుంచి క్షమాపణలు చెపుతున్నట్లు ప్రకటన కోరతామని సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తెలిపింది. దినపత్రికల్లో వచ్చిన పలు వార్తలను చూశామని, కోర్టులో సమర్పించిన వాటిని కూడా గమనించామని ధర్మాసనం పేర్కొంది.