Agniveers special degree: 'అగ్నిపథ్' ద్వారా త్రివిధ దళాల్లో సేవలందించే అగ్నివీరుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని మూడేళ్ల ప్రత్యేక నైపుణ్య ఆధారిత డిగ్రీ కోర్సును ప్రారంభించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ తెలిపింది. అగ్నివీరులు సైన్యంలో పొందిన శిక్షణ నైపుణ్యాలను అధికారికంగా గుర్తించనుంది. డిగ్రీ ఉత్తీర్ణతకు అవసరమయ్యే క్రెడిట్స్‌లో 50శాతం ఈ నైపుణ్యాల ఆధారంగా ఇవ్వనుంది. మిగతా 50 శాతం క్రెడిట్స్ అగ్నివీరులు ఎంపిక చేసుకునే కోర్సుల ద్వారా పొందాల్సి ఉంటుంది. ఇందులో ఎకనామిక్స్, లాంగ్వేజెస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ వంటి కోర్సులుంటాయి.
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(IGNOU) ఈ ప్రత్యేక డిగ్రీ కోర్సును అందించనుంది. దీనికి భారత్‌తో పాటు విదేశాల్లో విద్య, ఉద్యోగాల కోసం గుర్తింపు ఉంటుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి సైన్యం, నావికా దళం, వాయుసేనలు IGNOUతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.
భారతీయ సైనిక దళాల నియామకాల్లో విప్లవాత్మక మార్పు దిశగా త్రివిధ దళాల్లో చేరాలనుకునే యువత నియామక ప్రక్రియలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కేంద్రం. 'అగ్నిపథ్' పేరుతో షార్ట్ సర్వీస్ విధానాన్ని గురువారం ప్రకటించింది. కొత్త విధానం ద్వారా నియామకాల కోసం టూర్ ఆఫ్ డ్యూటీ పేరుతో ప్రత్యేక ర్యాలీలు చేపట్టనున్నారు. వచ్చే మూడు నెలల్లో తొలి ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రతి బ్యాచ్‌లో 45వేల మందిని తీసుకోనున్నారు. అగ్నిపథ్ విధానం కింద త్రివిధ దళాల్లో నియామకాలను షార్ట్‌టర్మ్, ఒప్పంద ప్రాతిపదికన చేపడతారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువత దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఆరు నెలలు శిక్షణ ఇస్తారు. మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగిస్తారు. అగ్నిపథ్‌లో చేరిన యువతకు సైనికులతో సమానంగా ర్యాంకులు, వేతనాలు ఇస్తారు. నాలుగేళ్ల ఆర్మీ సర్వీసు పూర్తయ్యాక.. ప్రతిభ చూపిన వారిలో 25 శాతం మందికి.. మెరుగైన ప్యాకేజీతో పాటు.. శాశ్వత కమిషన్‌లో అవకాశం దక్కుతుంది. నాలుగేళ్ల సర్వీసు పూర్తైన వారు.. స్వచ్ఛందంగా కేంద్ర డేటాబేస్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఎంపికలు ఆటోమేటెడ్ పద్ధతిలో జరుగుతాయి. ఎంపికైన వారందరికీ రెగ్యులర్ కేడర్‌లో ప్రవేశానికి అర్హత లభిస్తుంది. శాశ్వత కమిషన్‌కు ఎంపిక కాని వారు.. పదవీ విరమణ తరువాత ఉపాధి అవకాశాలు పొందేలా నిబంధనల్లో మార్పులు ఉంటాయి.
నియామకాల్లో ప్రాధాన్యం
అగ్నిపథ్ విధానంలో త్రివిధ దళాల్లోకి చేరే అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు CAPF, అస్సాం రైఫిల్స్‌నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. అగ్నిపథ్ విధానంలో నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకునేవారికి CAPF, అస్సాం రైఫిల్స్ నియామకాల ప్రక్రియలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది.