తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రధాని మోదీకి దేశమే సర్వస్వం' - ప్రకాశ్ జావడేకర్ మోదీ ఆదరణ

ప్రజాదరణ అధికంగా ఉన్న దేశాధినేతల జాబితాలో ప్రధాని మోదీ మొదటి స్థానంలో ఉండటం దేశానికి గర్వకారణమని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కొనియాడారు. ప్రధానికి దేశమే సర్వస్వమని, మహమ్మారి సమయంలో ఆయన చూపిన నాయకత్వ పటిమకు ఇవి ప్రశంసలు వంటివని కేంద్ర మంత్రులు పేర్కొన్నారు.

Modi's high approval rating a matter of pride for all Indians: Nadda
'ప్రధాని మోదీకి దేశమే సర్వస్వం'

By

Published : Jan 2, 2021, 5:50 PM IST

ప్రజామోదం లభించిన దేశాధినేతల జాబితాలో ప్రధాని మోదీ ప్రథమ స్థానంలో ఉండటం భారతీయులందరికీ గర్వకారణమని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. మోదీ సమర్థవంతమైన నాయకత్వానికి ఇది సాక్ష్యమని అన్నారు.

"దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, వర్గాల్లో మోదీకి ఆదరణ పెరగడమే కాదు.. దేశానికి ఆయన అంకితమైన తీరు పట్ల ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. సవాళ్లతో కూడిన సమయంలోనూ ప్రపంచ నేతల్లో మోదీ నెంబర్ 1గా నిలిచారు."

-నడ్డా ట్వీట్

మరోవైపు, ఈ విషయంపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రెస్ కాన్ఫరెన్స్​లో మాట్లాడారు ఇతర నేతల రేటింగ్​లో మార్పులు ఉన్నప్పటికీ.. గత ఆరేళ్ల వ్యవధిలో మోదీ ప్రజామోదం క్రమంగా పెరుగుతుండటం చాలా అరుదైన విషయమని పేర్కొన్నారు. కరోనాను ప్రభుత్వం విజయవంతంగా కట్టడి చేయడం వల్ల ఆయన ఆదరణ మరింత పెరిగిందన్నారు. రెండోస్థానంలో ఉన్న ప్రజాస్వామ్య దేశాధినేతలతో పోలిస్తే రెట్టింపు రేటింగ్​తో మోదీ కొనసాగుతున్నారని చెప్పారు. ప్రధానికి దేశమే సర్వస్వమని కొనియాడారు.

రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ సైతం ప్రధానమంత్రి మోదీని కొనియాడారు. మోదీ అత్యంత ఆదరణ ఉన్న నేతగా ఉండటం గర్వకారణమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. మహమ్మారి సమయంలో ఆయన చూపిన నాయకత్వ పటిమకు ప్రశంసలు లభించాయన్నారు.

ఏంటీ సర్వే?

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాధినేతల పనితీరుపై అమెరికా సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. ఈ సంస్థ తాజాగా చేపట్టిన ఈ అధ్యయనంలో ప్రధాని మోదీకి 55 శాతం మంది ప్రజల ఆదరణ ఉందని తేలింది. మోదీకి 75 శాతం మంది ప్రజలు మద్దతు ఇస్తుండగా.. 20 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. సగటు లెక్కన 55 శాతం మంది ఆయనకు మద్దతుగా ఉన్నారు. ఈ స్థాయిలో రేటింగ్ వేరే ఏ దేశాధినేతకు లేకపోవడం విశేషం. 2,126 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.

రెండో స్థానంలో ఉన్న జర్మనీ ఛాన్స్​లర్ ఏంజెలా మెర్కెల్ రేటింగ్ 24 శాతం ఉండగా.. బ్రిటన్ ప్రధాని రేటింగ్ నెగిటివ్​లో ఉంది. ఆయనకు మద్దతు ఇస్తున్నవారికంటే వ్యతిరేకిస్తున్నవారే అధికంగా ఉన్నారు.

ఇదీ చదవండి:రాజస్థాన్​లో 53 నెమళ్లు మృతి- కారణమేంటి?

ABOUT THE AUTHOR

...view details