Modi Whatsapp Channel : ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ తీసుకువచ్చిన 'ఛానెల్స్'లో చేరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దీంతో ప్రధానికి సంబంధించిన సమాచారన్నంతా వాట్సాప్ వినియోగదారులు సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఈ సందర్భంగా తొలిసారి పోస్ట్ చేసిన ప్రధాని మోదీ.. వాట్సాప్ కమ్యూనిటీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. 'మీతో కలిసేందుకు మరింత దగ్గరవుతున్నా'నంటూ.. కొత్త పార్లమెంట్లో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు మోదీ. అంతకుముందు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా వాట్సాప్లో జాయిన్ అయ్యారు.
ట్విట్టర్లో మోదీనే టాప్
దేశంలో అత్యధికంగా సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనసాగుతున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్సైట్ X (ట్విట్టర్)లో అత్యధిక ఫాలోవర్స్ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 91.5 మిలియన్లు(9 కోట్ల 15 లక్షలు) ఉండగా.. ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారిక ట్విట్టర్ ఖాతాను 54 మిలియన్ల (5.4 కోట్ల) మంది ఫాలో చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ ఖాతాకు 33.7 మిలియన్ (3.37 కోట్ల మంది) ఫాలోవర్స్ ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫాలోవర్స్ సంఖ్య ఇటీవల 26 మిలియన్ (2.6 కోట్లు) దాటింది.
Whatsapp Channels India :వాట్సాప్ ఇటీవలే ఛానెల్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. భారత్ సహా 150 దేశాల్లో ఫీచర్‌ను ప్రారంభించినట్లు మాతృ సంస్థ మెటా వెల్లడించింది. ఇప్పటికే చాలా మందికి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగిలిన వారికీ రానుంది.