భారత్ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమి (International Solar Alliance) లో 101వ సభ్య దేశంగా అమెరికా చేరింది. ఈ మేరకు గ్లాస్గోలో జరుగుతున్న సీఓపీ 26 సదస్సులో భాగంగా అమెరికా ప్రత్యేక ప్రతినిధి జాన్ కెర్రీ ఒప్పందంపై సంతకం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహించిన అంతర్జాతీయ సౌర కూటమిలో చేరడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కెర్రీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సౌరశక్తిని మరింత వేగంగా విస్తరించడానికి ఇది ఒక ముఖ్యమైన సహకారమని కెర్రీ అన్నారు.
అంతర్జాతీయ సౌర కూటమి- (ఐఎస్ఏ)లో అమెరికా చేరడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. సౌర శక్తిని వినియోగించుకునే భాగస్వామ్య అన్వేషణలో భాగంగా అమెరికా తీసుకున్న నిర్ణయం కూటమిని మరింత బలోపేతం చేస్తుందని మోదీ వ్యాఖ్యానించారు.