Fuel Price VAT:దేశ రాజకీయాల్లో మరోసారి 'పెట్రో మంట' రాజుకుంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో.. విపక్షాలు విరుచుకుపడ్డాయి. పలు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించలేదన్న మోదీకి కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. ఎన్డీఏ ప్రభుత్వం భారీగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీ సంగతేంటని ప్రశ్నించింది. మహారాష్ట్ర నుంచి కేంద్రానికి అధిక ఆదాయం వస్తుందని, అయినా ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపుతోందని దుయ్యబట్టారు సీఎం ఉద్ధవ్ ఠాక్రే. తృణమూల్ కాంగ్రెస్ కూడా ప్రధాని వ్యాఖ్యలను తప్పుబట్టింది.
ఇంతకీ మోదీ ఏమన్నారు?:పెట్రోల్ ధరల పెరుగుదలపై మోదీ తొలిసారి స్పందించారు. కేంద్రం ఇంధన ధరలపై గత నవంబర్‌లో ఎక్సైజ్ సుంకాలు తగ్గించినప్పటికీ.. కొన్ని రాష్ట్రాలు పన్నులపై వెనక్కి తగ్గట్లేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ప్రధాని.. ఈ సందర్భంగా ఇంధన ధరల గురించి ప్రస్తావించారు. కరోనా పరిస్థితులపై సీఎంలతో సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని.
''దేశ ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరల భారం తగ్గించేందుకు కేంద్రం గత నవంబర్‌లో ఎక్సైజ్ పన్ను తగ్గించింది. సుంకాలను తగ్గించాలని రాష్ట్రాలను కోరింది. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు పన్ను తగ్గించాయి. మహారాష్ట్ర, బంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఝార్ఖండ్ రాష్ట్రాలు ఏవో కారణాల వల్ల పన్ను తగ్గించలేదు. దీనివల్ల వారికి ఎంత ఆదాయం సమకూరిందనే విషయాల జోలికి వెళ్లను. కానీ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నవంబర్‌లో తగ్గించాల్సిన పన్ను ఇప్పటికైనా తగ్గించి ప్రజలకు ప్రయోజనం కలిగించండి.''
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
Modi On Fuel Price:భాజపా పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, గుజరాత్ ప్రభుత్వాలు.. వరుసగా రూ. 5000, 4000 కోట్ల చొప్పున ఆదాయం కోల్పోయినా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో వ్యాట్ తగ్గించాయని మోదీ ప్రస్తావించారు. పొరుగు రాష్ట్రాలు అలా చేయలేకపోయాయని సునిశిత విమర్శలు చేశారు. చెన్నై, జైపుర్, హైదరాబాద్‌లో పెట్రోల్ ధరలు.. దమన్ దీవ్, లఖ్‌నవూ, జమ్మూ, గువాహటి, దేహ్రాదూన్‌లో కంటే చాలా ఎక్కువ అని మోదీ అన్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ వ్యాఖ్యలపై పలు ప్రతిపక్ష పార్టీలు, భాజపాయేతర ప్రభుత్వాలు స్పందించాయి.
'కేంద్రం.. రూ. 27 లక్షల కోట్లు వెనకేసుకుంది':భాజపాయేతర రాష్ట్రాలు.. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించకపోవడాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. గత యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే కేంద్రం భారీగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీ సంగతేంటని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. మోదీ, కేంద్రాన్ని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఎక్సైజ్ సుంకాలతోనే కేంద్రం.. రూ. 27 లక్షల కోట్లు వెనకేసుకుందని దుయ్యబట్టారు.
''కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ. 9.48, డీజిల్‌పై రూ. 3.56 ఉంది. మోదీ ప్రభుత్వంలో ఈ పన్నులు రూ. 27.90, రూ. 21.80కు చేరాయి. లీటర్ పెట్రోల్‌పై రూ. 18.42, డీజిల్‌పై రూ. 18.24 మేర ఎక్సైజ్ పన్ను పెరిగింది. భాజపా ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్‌పై పన్నుల నుంచి ఆర్జించిన రూ. 27 లక్షల కోట్ల ఖాతా ఇవ్వండి.''
- రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
మోదీపై విరుచుకుపడ్డ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే:వ్యాట్ తగ్గించాలన్న మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. రాష్ట్రానికి కేంద్రం రూ. 26 వేల 500 కోట్లు బాకీ ఉందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదన్న ఠాక్రే.. మహారాష్ట్రపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందన్నారు.