Modi UP Rally: కరోనా వ్యాక్సిన్లపై విపక్ష పార్టీలు వదంతులను వ్యాప్తి చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తొలిదఫాలో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో 23 నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. కరోనా వ్యాక్సిన్‌ను మోదీ వ్యాక్సిన్‌గా అభివర్ణించి ప్రజలు దానిని తీసుకోవద్దని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ గతంలో చేసిన వ్యాఖ్యలను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు విశ్వసించకుండా పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్‌ను తీసుకున్నారని ప్రశంసించారు.
యూపీలో యోగి సర్కార్.. గూండాలు, మాఫియాను తరిమికొట్టిందని అన్నారు. రాష్ట్రం శాంతియుతంగా ఉండాలంటే ఎవరిని గెలిపించాలో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని ప్రధాని సూచించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్ల కొవిడ్ టీకా పంపిణీలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలు ఎంతో ప్రయోజనం పొందారని తెలిపారు.
''కరోనా వ్యాక్సిన్‌లపై వదంతులు వ్యాప్తి చేసి కొన్నిసార్లు ప్రశ్నలు లేవనెత్తిన వారికి తగిన జవాబు దక్కింది. ప్రజలు కరోనా వ్యాక్సిన్ తీసుకోకుండా వారు కొన్నిసార్లు భయపెట్టేవారు. వ్యాక్సిన్‌లపై దుష్ప్రచారాన్ని వ్యాప్తి చేసిన వారు ఎవరో దేశ ప్రజలు కాస్త ఆలోచించాలి. దేశ ప్రజలకు నా మాటలపై విశ్వాసం ఉండేది. నా మాటలను నమ్మి ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వచ్చారు. వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఇంత భారీ స్ధాయిలో టీకాల పంపిణీ జరుగుతుందని నమ్మి ఉండరు.''
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
సమాజ్‌వాదీ పార్టీ నేతల గురించి మాట్లాడిన మోదీ.. వారు పేపర్‌పైనే సమాజ్‌వాదీలు అని.. రైతుల పరిస్థితిని మెరుగుపర్చేందుకు ఏం చేయలేకపోయారని విమర్శించారు. గత ప్రభుత్వాలు వ్యవసాయరంగాన్ని తీర్చిదిద్దలేకపోయిందని అన్నారు.