Modi Tamil Nadu Visit Today : తమిళనాడులో ఇటీవలే సంభవించిన వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాల పరిస్థితి తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సంక్షోభ సమయంలో తమిళనాడు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. తాము రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమైనంత సహాయం చేస్తున్నామని వెల్లడించారు.
"2004-2014 వరకు అప్పటి ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.30 లక్షల కోట్లు ఇచ్చింది. గత పదేళ్లలో మా ప్రభుత్వం రూ.120 లక్షల కోట్లు ఇచ్చింది. 2004-2014 మధ్య తమిళనాడుకు వచ్చిన నిధులు కన్నా మేం 2.5రెట్లు ఎక్కువగా ఇచ్చాం. గత ఏడాదిలో 40మంది కేంద్రమంత్రులు రాష్ట్రంలో 400సార్లు పర్యటించారు. తమిళనాడు ఎంత వేగంగా అభివృద్ధి చెందితే దేశం కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతుంది. మేక్ ఇన్ ఇండియాకు తమిళనాడు పెద్ద బ్రాండ్ అంబాసిడర్‌గా అవతరిస్తోంది."
-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
తీర ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు, మత్స్యకారుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి చాలా కృషి చేశామని ప్రధాని మోదీ తెలిపారు. తొలిసారిగా ప్రత్యేక మత్స్యశాఖను ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించామని చెప్పారు. "తమిళ సంస్కృతీసంప్రదాయాలను చూసి భారతదేశం గర్విస్తోంది. నాకు చాలా మంది తమిళ స్నేహితులు ఉన్నారు. వారి దగ్గర తమిళ సంస్కృతి గురించి తెలుసుకున్నాను. నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తమిళనాడు గురించి మాట్లాడకుండా ఉండలేను. కొత్త పార్లమెంట్ భవనంలో పవిత్ర సెంగోల్‌ను ఏర్పాటు చేశాం. ఇది దేశానికి తమిళ వారసత్వం అందించిన సుపరిపాలన నమూనా" అని ప్రధాని మోదీ తెలిపారు.