Modi Sunak Bilateral Talks : దిల్లీలో రెండు రోజులపాటు జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంతో పాటు వాణిజ్య సంబంధాలపై వీరు చర్చించారు.
Rishi Sunak India Visit : సునాక్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన తర్వాత ప్రధాని మోదీ ఎక్స్(ట్విట్టర్)లో ఫొటోలను పోస్ట్ చేశారు. "జీ20 సదస్సు సందర్భంగా దిల్లీకి వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను కలవడం చాలా గొప్ప విషయం. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పెంచేందుకు మేం చర్చించాం. సంపన్నమైన ప్రపంచం కోసం భారత్, బ్రిటన్ నిరంతరం కృషి చేస్తాయి" అని ట్వీట్ చేశారు.
జపాన్ ప్రధానితో మోదీ ద్వైపాక్షిక చర్చలు..
Japan PM Modi Bilateral Talks : జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో కూడా ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కనెక్టివిటీ, వాణిజ్యంతో పాటు ఇతర రంగాల్లో సహకారం పెంపొందించుకోవడానికి భారత్, జపాన్ ఆసక్తిగా ఉన్నాయని మోదీ తెలిపారు. "జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో ఫలప్రదమైన చర్చ జరిగింది. భారత జీ20 అధ్యక్షత, జపాన్ జీ7 ప్రెసిడెన్సీతోపాటు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించాం" అని మోదీ ట్వీట్ చేశారు.
ఇటలీ ప్రధానితో మోదీ ద్వైపాక్షిక చర్చలు..
Italy PM Modi Bilateral Talks : ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో కూడా ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ప్రపంచ జీవ ఇంధన కూటమి, భారత్- పశ్చిమాసి కారిడార్‌లో భాగస్వామిగా ఇటలీ చేరినందుకు.. మెలోనిని మోదీ ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ఇరు దేశాధినేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. "ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో అద్భుతమైన సమావేశం జరిగింది. వాణిజ్యం, రక్షణ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు పలు రంగాల్లో సహకారం గురించి చర్చించాం. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్, ఇటలీ కలిసి పని చేస్తాయి" అని మోదీ ట్వీట్ చేశారు.