తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ స్టోరీ'.. ప్రధాని జీవితంలో ఎన్నో అరుదైన ఘట్టాలు.. - పీఎం మోదీ

Modi Story: ప్రధాని నరేంద్ర మోదీతో ముచ్చటించిన వ్యక్తుల నుంచి సేకరించిన స్ఫూర్తిదాయక అనుభవాలతో ప్రత్యేక పోర్టల్‌ ప్రారంభమైంది. మోదీ స్టోరీ డాట్‌ ఇన్‌ పేరుతో రూపొందించిన ఈ పోర్టల్‌ను జాతిపిత మహాత్మాగాంధీ మనవరాలు సుమిత్రా గాంధీ కులకర్ణి ప్రారంభించారు. గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో మోదీ చదువుకున్న పాఠశాల ప్రిన్సిపల్‌ రాస్‌బిహారీ మనియార్‌, 90వ దశకంలో ఆయనకు ఆశ్రయం కల్పించిన శారదా ప్రజాపతి వంటి వారి నుంచి వివరాలు, అనుభవాలు సేకరించి ఇందులో పొందుపర్చారు.

PM-PORTAL
మోదీ స్టోరీ డాట్​ ఇన్​ పోర్టల్​

By

Published : Mar 26, 2022, 5:58 PM IST

Updated : Mar 26, 2022, 6:24 PM IST

Modi Story: అవి 1980ల నాటి రోజులు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అప్పుడప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఓ రోజు గుజరాత్‌కు చెందిన డాక్టర్‌ అనిల్ రావల్‌ అనే వ్యక్తి మోదీతో కలిసి ప్రయాణం చేశారు. ఆ సమయంలో రాజకీయాల గురించి సంభాషణ రాగా రావల్‌.. మోదీని ఓ ప్రశ్న అడిగారు. సమాజంలో చిట్టచివరి వ్యక్తి అభ్యున్నతి కోసం ఎలా కట్టుబడి ఉంటారు..? అని ప్రశ్నించారు. దీనికి మోదీ బదులిస్తూ.. "ఒక సారి నేను ఓ స్వయంసేవక్‌ ఇంటికి వెళ్లాను. అది ఓ మురికివాడలో ఉంది. ఆ ఇంట్లో స్వయంసేవక్‌ తన భార్య, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. నేను వెళ్లగానే నాకు పళ్లెంలో సగం రొట్టె, చిన్న గిన్నెలో పాలు తీసుకొచ్చి అందించారు. తల్లి ఒడిలో కూర్చున్న ఆ చిన్నారి ఆ పాలగిన్నె వైపు ఆకలిగా చూస్తున్నాడు. అప్పుడే నాకు అర్థమైంది ఆ పాలు చిన్నారి కోసం ఉంచినవి అని. నేను ఆ సగం రొట్టెను నీళ్లతో తినేసి పాలు వదిలేశారు. ఆ తర్వాత ఆ తల్లి పాలగిన్నెను చిన్నారికి ఇచ్చింది. ఆ బాబు వాటిని గడగడా తాగేశాడు. అప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే నేను నిర్ణయించుకున్నా. సమాజంలోని చిట్టచివరి వ్యక్తి అభ్యున్నతి కోసమే నా ఈ జీవితం అంకితం చేయాలని..!" అని చెప్పారు.

చిన్నారులతో ప్రధాని మోదీ

ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్‌ అనిల్‌ రావల్‌ చెబుతూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈయనే కాదు.. మోదీతో అనుబంధం, పరిచయం ఉన్న ఎంతోమంది ప్రధానితో తమకున్న అనుభవాలను పంచుకున్నారు. ఆ స్ఫూర్తిదాయక అనుభవాలతో కూడిన ప్రత్యేక పోర్టల్‌ తాజాగా ప్రారంభమైంది. 'MODI STORY' పేరుతో రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను జాతిపిత మహాత్మాగాంధీ మనవరాలు సుమిత్రా గాంధీ కులకర్ణి చేతుల మీదుగా ప్రారంభించారు.

అరుదైన ఘట్టాలెన్నో: మోదీ గురించి ఎంతోమందికి తెలియని అరుదైన ఘట్టాల సమాహారమే ఈ వెబ్‌సైట్‌. గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో మోదీ చదువుకున్న పాఠశాల ప్రిన్సిపాల్‌ రాస్‌ బిహారీ మణియార్‌, 90వ దశకంలో ఆయనకు ఆశ్రయం కల్పించిన శారదా ప్రజాపతి వంటి వారు.. ఇందులో మోదీతో తమకున్న అనుభవాలను షేర్​ చేసుకున్నారు. ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా, బ్యాడ్మింటన్‌ కోచ్‌ దిగ్గజం పుల్లెల గోపీచంద్ సహా మరికొందరు మోదీతో తమ అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచార సమయంలో మోదీ ఆలోచనలు, విద్యార్ధిగా సైనిక దళాలపై ఆయన అభిప్రాయాలు, దేశ సేవపై ఆసక్తి వంటి వివరాలు ఇందులో ఉన్నాయి. ఈ వెబ్‌సైట్‌ నుంచి భాజపా అధికారిక ట్విటర్‌ ఖాతాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు తమ ట్విటర్‌ ఖాతాల్లో రాసుకొచ్చారు.

ప్రధాని పరీక్షా పే చర్చ: పరీక్షా పే చర్చ కార్యక్రమం మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏప్రిల్‌ 1న పరీక్షా పే చర్చ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ట్విట్టర్‌ వేదికగా ప్రధాని ఈ అంశంపై స్పందించారు. పరీక్షలు, జీవితానికి సంబంధించిన విభిన్న అంశాల గురించి దీని ద్వారా మాట్లాడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఒత్తిడి లేని పరీక్షల గురించి మరోసారి మాట్లాడుకుందామని అన్నారు. చురుకైన పరీక్షా యుద్ధ వీరులు సహా వారి తల్లితండ్రులు, అధ్యాపకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు. పరీక్షల విషయంలో విద్యార్ధులకు ఉండే భయం, ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రధాని గత నాలుగు సంవత్సరాలుగా పరీక్షాపే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొదటి మూడు సంవత్సరాలు భౌతిక హాజరు ద్వారా ఈ కార్యక్రమం జరగగా, కరోనా కారణంగా గత ఏడాది ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించారు.

Last Updated : Mar 26, 2022, 6:24 PM IST

ABOUT THE AUTHOR

...view details