దేశ ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌లోని ఓ కమాండో ప్రమాదవశాత్తు మృతి చెందారు. పీఎం కాన్వాయ్‌లో విధులు నిర్వర్తించే ఓ ఎస్పీజీ కమాండో కాలువలో పడి మరణించారు. ప్రస్తుతం సెలవుల్లో ఉన్న కమాండో కుటుంబసభ్యులతో కలిసి బైక్‌పై శిర్డీకి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా.. బైక్ అదుపుతప్పి కుటుంబంతో సహా కాలువలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడగా.. ఆ కమాండో మృతి చెందారు. దాదాపు 20 గంటల తర్వాత సహాయక సిబ్బంది కమాండో మృతదేహాన్ని వెలికితీశారు.
మహారాష్ట్ర నాశిక్ జిల్లాలోని సిన్నార్ ప్రాంతంలోని మెంధీ గ్రామానికి చెందిన గణేశ్ గీతే(36).. 2011లో సీఐఎస్ఎఫ్లో చేరారు. ఆ తర్వాత ఎస్పీజీ విభాగానికి ఎంపికై ప్రస్తుతం ప్రధాని మోదీ కాన్వాయ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు గణేశ్ ఫిబ్రవరి 24 నుంచి కొన్ని రోజులు సెలవు తీసుకున్నాడు. ప్రస్తుతం సెలవుల్లో ఉన్న గణేశ్ గురువారం తన భార్య, ఏడేళ్ల కుమార్తె, 18 నెలల కుమారుడితో కలిసి ప్రసిద్ధ శిర్డీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి బైక్‌పై వెళ్లారు. సాయంత్రం 6:30 గంటల సమయంలో వారు తిరిగి వస్తుండగా.. ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఓ మలుపు వద్ద వారి బైక్ అదుపుతప్పింది. దీంతో ఒక్కసారిగా గణేశ్ కుటుంబం బైక్‌తో సహా గోదావరి నదిపై నిర్మించిన ఓ డ్యామ్ కాలువలో పడిపోయింది.