Modi Speech Today In Bjp Office :మహిళా రిజర్వేషన్ బిల్లు సాధారణమైంది కాదని.. నూతన ప్రజాస్వామ్య నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మహిళల సంకెళ్లను తెంచేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని.. వారి సంక్షేమం, భద్రత, గౌరవానికి అనేక పథకాలు తీసుకువచ్చిందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో.. దిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారీ మెజారిటీతో స్థిర, దృఢమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే.. మహిళా రిజర్వేషన్ బిల్లు సాకారం అయ్యిందని చెప్పారు ప్రధాని మోదీ. బలమైన, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే దేశం అభివృద్ధి దిశగా సాగుతోందని.. మహిళా రిజర్వేషన్ బిల్లు నిరూపించిందన్నారు. ఒకప్పుడు ఈ బిల్లును వ్యతిరేకించిన వారే.. మహిళల శక్తిని తెలుసుకుని మద్దతు తెలిపారని వ్యాఖ్యానించారు.
"దేశ ప్రజలు ముఖ్యంగా మహిళలు.. ఓటువేసి మెజార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు కారణమయ్యారు. మెజార్టీ ప్రభుత్వం ఉంటే దేశం ఏ విధంగా పెద్ద నిర్ణయాలు తీసుకుంటుందో, సవాళ్లను ఎలా అధిగమిస్తుందో చెప్పేందుకు మహిళా బిల్లే సాక్ష్యంగా నిలుస్తోంది. దేశంలో మెజార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎన్నో పనులు జరిగాయి. మహిళల ప్రయోజనం కోసం ప్రతిదశలోనూ నిర్ణయం తీసుకున్నాం."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి