Modi Saudi Prince Bilateral Talks :భారత్, సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం.. పశ్చిమాసియాతోపాటు ప్రపంచ స్థిరత్వానికి ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇరుదేశాలు కొత్త అంశాలతో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నాయని చెప్పారు. భారత్‌కు అత్యంత వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా ఒకటని అన్నారు. ఆ దేశ యువరాజు, ప్రధాని మహ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
'యావత్ ప్రపంచం ఎంతో ప్రయోజనం పొందుతుంది'
Modi With Saudi Prince : దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో మోదీ, మహ్మద్ బిన్ సల్మాన్‌లు.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల సన్నిహత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అనేక మార్గాలు అన్వేషించామని మోదీ తెలిపారు. మరోవైపు, భారత్‌లో పర్యటించడం సంతోషంగా ఉందని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ తెలిపారు. జీ20 సదస్సును నిర్వహించినందుకు భారత్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సు వల్ల యావత్ ప్రపంచం ఎంతో ప్రయోజనం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల గొప్ప భవిష్యత్తు కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు.
తొలిసారి భారత్‌కు..
Saudi Prince India Visit : దిల్లీలో రెండు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ20 సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు తొలిసారి మహ్మద్ బిన్ వచ్చారు. సదస్సు అయ్యాక ఆయన భారత్‌లో పర్యటిస్తున్నారు. అయితే మోదీతో ద్వైపాక్షిక చర్చలకు ముందు సౌదీ యువరాజుకు రాష్ట్రపతి భవన్ వెలుపల లాంఛనప్రాయ స్వాగతం లభించింది.