Modi Punjab tour: పంజాబ్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గత నెలలో ఫిరోజ్‌పుర్ పర్యటనలో భద్రతా లోపం తీవ్ర దుమారం రేపగా.. తాజాగా అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ప్రార్థనాస్థలాన్ని దర్శించుకోకుండానే వెనుదిరిగారు.
PM Modi in Jalandhar:
పంజాబ్ పర్యటనకు వచ్చిన మోదీ.. జలంధర్‌లోని దేవీ తలాబ్ మందిరాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. అయితే అధికారులు తగిన ఏర్పాట్లు చేయలేదని, ఫలితంగా మందిరాన్ని దర్శించుకోలేకపోయానని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పరిస్థితి ఈ రకంగా ఉందని ధ్వజమెత్తారు. జలంధర్‌కు మరోసారి వస్తానని, దేవిని తప్పక దర్శించుకుంటానని బహిరంగ సభలో మోదీ స్పష్టం చేశారు.
"దేవి తలాబ్ మందిరాన్ని దర్శించుకోవాలనేది నా కోరిక. కానీ, ఇక్కడి పోలీసులు, యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేయలేమని చెప్పాయి. హెలికాప్టర్లో వెళ్లిపోవాలని సూచించాయి. ఇలా ఉంది ఇక్కడి ప్రభుత్వ పరిస్థితి. కానీ, నేను మళ్లీ వచ్చి మందిరాన్ని దర్శించుకుంటాను."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
అంతకుముందు, జనవరి 5న మోదీ పంజాబ్‌లో పర్యటించారు. ఫిరోజ్పుర్లో నిరసనకారులు అడ్డగించడం వల్ల కాన్వాయ్‌లో చిక్కుకుపోయిన మోదీ.. ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండానే దిల్లీకి తిరుగుపయనమయ్యారు.
Modi Punjab Campaign
రాష్ట్రంలో భాజపా నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత పంజాబ్‌లో అభివృద్ధి నూతన శకం మొదలవుతుందని చెప్పారు. నవభారత్ ప్రతిజ్ఞతో దేశం ముందుకెళ్తోందని, నవ బంజాబ్ సాకారమైనప్పుడే దేశ ప్రజల ప్రతిజ్ఞ నెరవేరుతుందని అన్నారు. నూతన పంజాబ్‌లో ప్రతి దళితుడికీ గౌరవం లభిస్తుందని, అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని వివరించారు. అవినీతికి ఆస్కారం లేదని అన్నారు.
ఈ సందర్భంగా విపక్షాలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు ఉందని, అలాంటి వారు రాష్ట్రానికేం చేస్తారని అన్నారు. పంజాబ్‌కు వచ్చి కొందరు పచ్చి అబద్దాలు చెబుతున్నారని దిల్లీ సీఎం కేజ్రీవాల్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. పంజాబ్‌ను మాదకద్రవ్యాలు లేని రాష్ట్రంగా మార్చుతామని చెబుతున్న వారు.. సొంత రాష్ట్రంలో మాత్రం భారీగా మద్యం దుకాణాలను తెరుస్తున్నారని ఆక్షేపించారు.
'నన్ను అడ్డుకున్నారు!'
మరోవైపు, మోదీ పర్యటన వల్ల తాను రాహుల్ గాంధీ సభకు హాజరు కాలేకపోయానని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆరోపించారు. 'ఉదయం 11 గంటలకు నేను ఉనాకు చేరుకున్నా. హోషియార్‌పుర్ వెళ్లేందుకు నా హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరించారు. మోదీ వెళ్తున్నారని ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. అందుకే రాహుల్ గాంధీ సభకు హాజరుకాలేకపోయాను' అని చన్నీ వివరించారు.
యూపీ సభలో మోదీ..
Modi UP news:అటు, ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్ దేహత్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. ముమ్మారు తలాక్‌కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టం ద్వారా ముస్లిం మహిళలకు ప్రయోజనం కలిగిందని అన్నారు. ఈ చట్టం వేలాది కుటుంబాలను కాపాడిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను మెరుగుపర్చడం ద్వారా ముస్లిం బాలికలు.. ప్రశాంతంగా స్కూల్‌కు వెళ్లగలుగుతున్నారని తెలిపారు. హిందూ ఓట్లను చీల్చేందుకే గోవాలో పోటీ చేస్తున్నామన్న టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం అంటే ఇదేనా అంటూ నిలదీశారు. ప్రతి ఎన్నికలకు కొత్త కూటమిని ఏర్పాటు చేస్తున్నారని సమాజ్‌వాదీ లక్ష్యంగా ధ్వజమెత్తారు మోదీ. ఫలితాలు వెలువడిన తర్వాత వారి మధ్య గొడవలు తథ్యమని చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి:'ఆపరేషన్ దిల్లీ' వేగవంతం.. త్వరలో ఆ సీఎంల సమావేశం!