Modi Punjab security breach: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలు తలెత్తిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజకీయ వర్గాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని వెళ్లిన రహదారిని దిగ్బంధించిన భారతీయ కిసాన్ యూనియన్(క్రాంతికారీ) నేత సుర్జీత్ సింగ్ ఫుల్.. ఈ ఘటనపై స్పందించారు. కాన్వాయ్‌లో ప్రధాని ఉన్న విషయం తమకు తెలియదని చెప్పారు. రోడ్డు ఖాళీ చేయించేందుకు పోలీసులే.. ప్రధాని వచ్చారన్న భ్రమను కలిగించి ఉంటారని భావించినట్లు పేర్కొన్నారు.
Modi punjab rally Farmers reaction
"ఈ రోడ్డు మార్గాన ప్రధాని ప్రయాణిస్తారని మాకు ఫిరోజ్‌పుర్ సీనియర్ ఎస్పీ సమాచారం అందించారు. ప్రధాని వస్తే గంట ముందే సమాచారం అందుతుందా? అని మేం ప్రశ్నించాం. మమ్మల్ని అక్కడి నుంచి పంపించేందుకే అలా చెబుతున్నారని అనుకున్నాం. హెలీప్యాడ్ సైతం ఏర్పాటు చేశారు కాబట్టి ప్రధాని వాయుమార్గంలో వస్తారని భావించాం. భాజపా కార్యకర్తలు మోదీ సభకు హాజరయ్యేలా చూసేందుకే పోలీసులు బుకాయిస్తున్నారని అనుకున్నాం."
-సుర్జీత్ సింగ్ ఫుల్, భారతీయ కిసాన్ యూనియన్(క్రాంతికారీ) అధ్యక్షుడు
Modi Punjab news
మోదీ వచ్చే మార్గంలో చాలా ట్రాఫిక్ ఉందని సుర్జీత్ తెలిపారు. ఒకవేళ నిజంగానే మోదీ రోడ్డుమార్గంలో వెళ్లాల్సి ఉంటే.. ఇరువైపులా ట్రాఫిక్‌ను ముందుగానే ఆపాల్సిందని అన్నారు.
సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన...
ప్రధాని కాన్వాయ్ అటు నుంచి వెళ్తోందని తమకు స్పష్టమైన సమాచారమేమీ లేదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పేర్కొంది. నిరసనకారులెవరూ కాన్వాయ్ వైపు వెళ్లలేదని స్పష్టం చేసింది. ప్రధాని ప్రాణాలకే ముప్పు అంటూ వచ్చిన ఆరోపణలు పూర్తిగా కల్పితాలని తెలిపింది.
"పంజాబ్‌లో జనవరి 5, 10న ప్రధాని పర్యటిస్తారన్న వార్తలతో.. సంయుక్త కిసాన్ మోర్చా అనుబంధ సంఘాలు ప్రతీకాత్మక నిరసనలకు పిలుపునిచ్చాయి. కేంద్రమంత్రి అజయ్ మిశ్ర అరెస్టు సహా మిగిలిన డిమాండ్లను పరిష్కరించాలని నిరసనకు దిగాయి. ఫిరోజ్‌పుర్ జిల్లా కేంద్రానికి వెళ్లకుండా కొంతమంది రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చాలా చోట్ల రైతులు రోడ్లపైనే బైఠాయించారు. అందులో మోదీ కాన్వాయ్ వచ్చి ఆగిన ఫ్లై ఓవర్ సైతం ఉంది. ఆ మార్గం గుండా మోదీ కాన్వాయ్ వెళ్తున్నట్టు రైతులకు స్పష్టమైన సమాచారం లేదు. వీడియోలో ఉన్న దృశ్యాలను బట్టి రైతులెవరూ మోదీ కాన్వాయ్ వద్దకు వెళ్లలేదని స్పష్టంగా తెలుస్తోంది. భాజపా జెండాలు పట్టుకున్న కొంతమంది మాత్రమే 'మోదీ జిందాబాద్' అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్ దగ్గరికి వెళ్లారు."
-సంయుక్త కిసాన్ మోర్చా, రైతు సంఘాల సమితి
'అంతా సానుభూతి కోసమే'
మోదీ పర్యటనలో భద్రతా లోపాలు ఏమైనా ఉంటే.. దర్యాప్తు జరపాలని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ డిమాండ్ చేశారు. 'భాజపా వర్గాలేమో భద్రతా లోపాలు అని చెబుతున్నాయి. సభకు జనం రాలేదని ముఖ్యమంత్రి చన్నీ చెబుతున్నారు. మరి భద్రతా లోపాల వల్ల సభ ఆగిపోయిందా లేదా అన్నదాతల ఆగ్రహం వల్ల ఆగిపోయిందా అనే విషయంపై దర్యాప్తు జరపాలి' అని ట్వీట్ చేశారు. ఇదే విషయంపై మీడియాతో మాట్లాడిన టికాయిత్.. ప్రజల సానుభూతి కోసం మోదీ చౌకబారు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 'పంజాబ్ పర్యటన కోసం ప్రధాని ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు? ప్రాణాలతో బయటపడ్డానంటూ మోదీ వ్యాఖ్యానించారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి ఇదంతా ఓ డ్రామా అని అర్థమవుతోంది. సానుభూతి కోసం చేస్తున్న చౌకబారు ప్రయత్నం ఇది' అని ఎద్దేవా చేశారు రాకేశ్ టికాయిత్.
'రైతులది.. ఏడాది కష్టం'