తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సంప్రదాయ వైద్యం భారత సమగ్ర జీవన విధానానికి ప్రతిబింబం: మోదీ

Who Traditional Medicine Center: ఆయుర్వేద, ఇతర సంప్రదాయ వైద్యాలు కేవలం చికిత్సా విధానాలు మాత్రమే కావని.. అవి భారతీయుల సమగ్ర జీవన విధానానికి ప్రతిబింబాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్​ జామ్‌నగర్‌లో అంతర్జాతీయ వైద్య కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ మాట్లాడారు.

who traditional medicine center
who traditional medicine center

By

Published : Apr 20, 2022, 8:12 AM IST

Who Traditional Medicine Center: సంప్రదాయ ప్రాచీన వైద్యానికి సంబంధించి నూతన శకం ప్రారంభమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడు రోజుల గుజరాత్‌ పర్యటనలో భాగంగా ఆయన రెండో రోజైన మంగళవారం ఆ రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. అందులో భాగంగా జామ్‌నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ ఘెబ్రియేసస్‌, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌కుమార్‌ జగన్నాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈ అంతర్జాతీయ కేంద్రంతో సంప్రదాయ వైద్యంలో ఓ నూతన శకం ప్రారంభం కానుందని అన్నారు. రానున్న 25 ఏళ్లలో ఈ కేంద్రం ప్రపంచ మానవాళికి దగ్గర కానుందని.. వారి జీవితాల్లో కీలక భాగం కానుందని పేర్నొన్నారు. భారతీయ ప్రాచీన విజ్ఞాన సంపద గురించి మోదీ మాట్లాడారు. ఆయుర్వేద. ఇతర సంప్రదాయ వైద్యాలు కేవలం చికిత్సా విధానాలు మాత్రమే కావని.. అవి భారతీయుల సమగ్ర జీవన విధానానికి ప్రతిబింబాలని పేర్కొన్నారు. తృణధాన్యాల ప్రాధాన్యతనూ ప్రధాని వివరించారు "మన పూర్వీకులు తృణధాన్యాలను వాడేవారు. తర్వాత వాటి వినియోగం తగ్గుతూ వచ్చింది. మళ్లీ ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆహారపు అలవాట్లలో మళ్లీ తృణధాన్యాల ప్రాత పెరిగింది. భారత అభ్యర్థన మేరకు 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి కూడా తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది" అని మోదీ చెప్పారు.

డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ గుజరాతీలో సభికులకు శుభాకాంక్షలు తెలిపి ప్రసంగించారు. తాను భారత్‌ వైద్య విధానాల నుంచి ఎంతో నేర్చుకున్నానని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ప్రధాని.. బనాస్‌కాంఠా జిల్లాలో కొత్త డెయిరీ ప్లాంట్‌ను, బంగాళాదుంపల ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్న దేశం భారతేనని తెలిపారు. దేశంలో పాల ఉత్పత్తి టర్నోవర్‌.. గోధుమలు, బియ్యం ఉత్పత్తి కంటే ఎక్కువే అని అన్నారు. పాడి పరిశ్రమతో అతిపెద్ద లబ్ధిదారులు చిన్న రైతులేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌పైనా పరోక్షంగా విమర్శలు చేశారు. తాను ప్రధాని అయ్యాక లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా సొమ్ము జమవుతుందని చెప్పారు. పాతరోజులు పోయాయని అన్నారు. "గతంలో ఓ మాజీ ప్రధాని.. దిల్లీ నుంచి విడుదలయ్యే రూపాయిలో 15 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరేవని అనేవారు. కానీ ఈ ప్రధానమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 పైసలు నేరుగా రైతుల ఖాతాలో డిపాజిట్‌ అవుతున్నాయి" అని మోదీ తెలిపారు.

ఇదీ చదవండి:4 రోజుల్లో 3 భేటీలు.. 6 రాష్ట్రాలకు 'పీకే' స్కెచ్ రెడీ.. రాహుల్​కు ఓకే.. కానీ...

ABOUT THE AUTHOR

...view details