Modi on Telangana Development : ప్రధాని నరేంద్ర మోదీ హనుమకొండలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్రం ఏర్పడి 9ఏళ్లు పూర్తయిందని.. దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర అని చెప్పారు. ఆర్థిక వృద్ధిలోనూ తెలంగాణది ప్రధాన భూమిక అని వివరించారు. మరోవైపు దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందని వ్యాఖ్యానించారు. దేశానికి ఇది స్వర్ణ సమయం అని మోదీ వెల్లడించారు.
Modi Telangana Tour Latest News :ఈ క్రమంలోనే రూ. 6,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించుకున్నామని మోదీ వివరించారు. దేశాభివృద్ధి కోసం శరవేగంగా పనులు పూర్తిచేస్తున్నామని అన్నారు. అనేక ఆర్థిక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నామని వెల్లడించారు. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రీయల్-ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయని చెప్పారు. కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నామని వ్యాఖ్యానించారు. తెలంగాణలో రైల్వే రహదారుల కనెక్టివిటీ పెంచుతున్నామని.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.