Modi Parliament Speech Today : భారత్ సువర్ణాధ్యాయానికి సాక్షిగా నిలిచిన పార్లమెంట్ పాత భవనంలో... 75 ఏళ్లపాటు జరిగిన చర్చలు, ప్రణాళికలు భారత గతిని మార్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ఈ భవనం వేదికైందని గుర్తు చేశారు. నెహ్రూ నుంచి వాజపేయీ, మన్మోహన్‌సింగ్ వరకు ఈ సభకు నేతృత్వం వహించారని గుర్తు చేసిన ప్రధాని.. వారి సేవలను కొనియాడారు. దీంతో పాటు మన్మోహన్ సింగ్ హయాంలో జరిగిన నోటుకు ఓటు కుంభకోణాన్ని ప్రధాని గుర్తు చేశారు. అనేకమంది ఉద్ధండులు ఈ సభలో ప్రజా ప్రయోజనాల ఉపన్యాసాలు వెలువరించారన్నారు. చర్చల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్ని ఉన్నా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా నిలిచాయని తెలిపారు. లోక్‌సభ ప్రత్యేక సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై సోమవారం ప్రధాని మోదీ చర్చను ప్రారంభించారు.
మంగళవారం నుంచి పార్లమెంట్‌సమావేశాలు కొత్త భవనంలో జరగనున్న వేళ.. పాత భవనంతో జ్ఞాపకాలను మోదీ గుర్తు చేసుకున్నారు. గంటకుపైగా ప్రసంగించిన మోదీ.. భారత ప్రజాస్వామ్య ప్రయాణాన్ని స్మరించుకున్నారు. ఈ వారసత్వ భవనంలో చివరి రోజు.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పనిచేసిన 7 వేల 500 మంది ఎంపీల సేవలను కొనియాడారు. ఈ పార్లమెంట్ భవనంలో ప్రతీ ఇటుకకు సెల్యూట్ చేస్తున్నట్లు మోదీ తెలిపారు. తాము కొత్త భవనానికి వెళ్లినా.. ఈ పాత భవనం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. స్వాతంత్ర్య భారత ప్రయాణంలో ఈ పార్లమెంట్‌ది ముఖ్యమైన అధ్యాయమని మోదీ అన్నారు. పాత పార్లమెంట్ భవనంలో జరిగే చివరి సెషన్ చారిత్రకమైనదన్న మోదీ.. భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో ఇది కీలకమైన ఘట్టమని అభిప్రాయపడ్డారు. పాత పార్లమెంట్ భవన నిర్మాణం కోసం దేశవాసులు రక్తం, స్వేదం చిందించారని కొనియాడారు. పాత భవనంలో జరిగిన ఎన్నో చర్చలు నవ భారత నిర్మాణానికి దోహదం చేశాయన్నారు.
"భారత పార్లమెంట్ 75 ఏళ్ల ప్రయాణాన్ని మరోసారి స్మరించుకునేందుకు ఇది సరైన సమయం. కొత్త పార్లమెంట్ భవనంలోకి వెళ్లేముందు ప్రేరణగా నిలిచిన చారిత్రక ఘటనలను గుర్తుచేసుకుని ముందుకు సాగడం అవసరం. ఈ భవనానికి వీడ్కోలు పలకడం ఒక ఉద్వేగభరితమైన క్షణం. ఇప్పుడు మేం ఈ భవనాన్ని విడిచి వెళ్తున్నాం. ఇప్పుడు మా మనసంతా భారంగా మారింది. ఎన్నో జ్ఞాపకాలతో భారంగా మారింది. ఈ భవనంతో ఎన్నో చేదు, తీపి జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఈ పార్లమెంట్‌లో మనమందరం ఎన్నో విభేదాలను, వివాదాలను చూశాం. కొన్నిసార్లు ఉత్సవాలకు ఈ భవనం వేదికగా నిలిచింది. స్వాతంత్ర్య భారత్ నవనిర్మాణానికి అవసరమైన ఎన్నో నిర్ణయాలు ఈ 75 ఏళ్లలో ఇదే పార్లమెంట్‌లో రూపం దాల్చడం మనమందరం చూశాం. ఇప్పుడు మనం ఈ చారిత్రక భవనం నుంచి వెళ్లిపోతున్నాం. ఈ పాత పార్లమెంట్ భవనం మన దేశ ప్రజల చెమట, శ్రమ, డబ్బుతో నిర్మించారని గర్వంతో చెప్పుకుంటున్నాం."
--నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
Modi Speech In Lok Sabha Today : పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడిని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్ సభ్యులను రక్షించేందుకు భద్రతా బలగాలు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
"ప్రజాస్వామ్య సౌధమైన ఈ పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇది కేవలం ఓ భవనంపై దాడి కాదు. ఇది ఒకరకంగా ప్రజాస్వామ్య మాతృమూర్తిపై, మన జీవాత్మపై దాడి. ఈ దేశం ఆ దాడిని మర్చిపోదు. ఈ భవనాన్ని, సభ్యులను కాపాడేందుకు ఉగ్రవాదులతో పోరాడుతూ చాలామంది బుల్లెట్ గాయాలతో మరణించారు. ఈరోజు నేను వారికి నమస్కరిస్తున్నాను."
--నరేంద్రమోదీ, ప్రధానమంత్రి