Modi On Olympics : 2029 యూత్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి తమకు కచ్చితంగా మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని భారత్ వదులుకోదని స్పష్టం చేశారు. దేశంలో ఒలింపిక్స్ నిర్వహణ.. 140 కోట్ల మంది భారతీయుల కల అని అభివర్ణించారు. ప్రపంచ స్పోర్ట్స్ టోర్నమెంట్లను నిర్వహించే సామర్థ్యాన్ని భారత్ ప్రదర్శించిందని చెప్పారు. మహరాష్ట్ర ముంబయిలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్లో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్లో మోదీ ప్రసంగించారు.
భారత్‌లో క్రీడల వారసత్వం..
Modi At NMACC Mumbai :సింధు లోయ నాగరికత నుంచి వేదాల యుగం వరకు.. మన దేశంలో క్రీడల వారసత్వం సుసంపన్నంగా ఉందని మోదీ చెప్పారు. 'ఒకే భూమి- ఒకే కుటుంబం- ఒక భవిష్యత్తు' అనే భావనను క్రీడలు బలపరుస్తున్నట్లు చెప్పారు. దేశంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బీజేపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. భారత్‌లో 40 ఏళ్ల తర్వాత ఐఓసీ సెషన్ జరగడం.. అది కూడా ముంబయిలో జరగడం దేశానికి గర్వకారణంగా చెప్పారు.
టీమ్ఇండియాకు అభినందనలు..
Ind Vs Pak World Cup 2023 Modi : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. "అహ్మదాబాద్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో చరిత్రాత్మక విజయం సాధించినందుకు టీమ్ఇండియాను అభినందిస్తున్నాను. మన సంస్కృతితోపాటు భారతీయుల జీవనశైలిలో క్రీడలు ముఖ్యమైన భాగం" అని మోదీ తెలిపారు.