దేశంలో కొవిడ్ ఉద్ధృతిపై తీవ్రంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన మోదీ.. కరోనా ప్రభావిత రాష్ట్రాల్లో పరిస్థితిని తెలుసుకున్నారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, కేంద్ర సహకారం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంపై సమావేశంలో చర్చించారు.
దిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రులు సమావేశంలో పాల్గొన్నారు.
'ప్లాంట్ లేకపోతే ఆక్సిజన్ అందదా?'
దిల్లీలో ఆక్సిజన్ నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రధానికి దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. దిల్లీలో ఉత్పత్తి ప్లాంట్ లేకపోతే ప్రజలకు ఆక్సిజన్ అందదా అని ప్రశ్నించిన కేజ్రీవాల్.. దిల్లీకి రావాల్సిన ట్యాంకర్లను ఆపేస్తున్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
"ప్రాణవాయువు కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పెద్ద విషాదానికి దారితీసే ప్రమాదం ఉంది. అదే జరిగితే మనల్ని మనం క్షమించుకోలేం. చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.. ఆక్సిజన్ ట్యాంకులు దిల్లీకి రావడంలో ఎలాంటి అవరోధాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎంలందరినీ ఆదేశించండి."