Modi Mann Ki Baat Today : చంద్రయాన్-3.. భారత్ విజయానికి ఎప్పటికీ ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. భారత్‌లో మహిళా శక్తికి చంద్రయాన్-3 విజయం ప్రత్యక్ష ఉదాహరణ అని మోదీ వ్యాఖ్యానించారు. మన్‌కీబాత్ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని.. చంద్రయాన్-3 మిషన్‌లో అనేక మంది మహిళా శాస్త్రవేత్తల కృషి ఉన్నట్లు తెలిపారు. అనంతంగా భావించే అంతరిక్షాన్ని కూడా భారత మహిళలు సవాలు చేస్తున్నారని చెప్పారు.
'భారత్ స్ఫూర్తికి చిహ్నంగా చంద్రయాన్-3'
Modi Mann Ki Baat Woman : విజయం సాధించాలనే బలమైన సంకల్పం భారత మహిళలకు ఉన్న వేళ.. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారకుండా ఏ శక్తీ ఆపలేదని స్పష్టం చేశారు. మిషన్ చంద్రయాన్ సరికొత్త భారత్ స్ఫూర్తికి చిహ్నంగా మారిందని ప్రధాని వ్యాఖ్యానించారు. అన్ని పరిస్థితుల్లో నెగ్గాలని సరికొత్త భారత్ కోరుకుంటుందని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా విజయం ఎలా సాధించాలో తెలుసు అని అన్నారు. మహిళా శక్తిని జోడిస్తే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుందని ప్రధాని తెలిపారు. చంద్రయాన్-3 విజయం అంతరిక్ష కార్యక్రమాల్లో అతిపెద్ద ముందడుగుగా మోదీ అభివర్ణించారు. దీని కోసం ఎంత మాట్లాడుకున్నా తక్కువేనన్నారు.
"మహిళల నేతృత్వంలో అభివృద్ధిని దేశంలో బలోపేతం చేయాలని ఎర్రకోట నుంచి పంద్రాగస్టు నాడు నేను చెప్పాను. మహిళా శక్తి సామర్థ్యాన్ని జోడిస్తే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. భారత్ మిషన్ చంద్రయాన్ మహిళా శక్తికి ప్రత్యక్ష ఉదాహరణ. ఈ మిషన్‌లో అనేక మంది మహిళా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రత్యక్షంగా భాగస్వామ్యమయ్యారు. ప్రాజెక్టు డైరెక్టర్, ప్రాజెక్టు మేనేజర్ ఇలా వివిధ వ్యవస్థలకు చెందిన కీలకమైన బాధ్యతలను మహిళలు నిర్వర్తించారు. భారత మహిళలు ఇప్పుడు అనంతం అని భావించే అంతరిక్షానికి కూడా సవాలు విసురుతున్నారు. ఏ దేశంలో మహిళలైనా ఇంత దృఢ సంకల్పంతో పని చేస్తుంటే ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారకుండా ఎవరు ఆపగలరు?"
-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
'జీ20 సమావేశాలకు భారత్ సిద్ధం'
G 20 Summit 2023 India :సెప్టెంబర్‌లో జీ20 సమావేశాలు నిర్వహించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నడూ లేనంతగా ఈసారి జీ20 సమావేశాలకు ఎక్కువ మంది హాజరవుతున్నట్లు తెలిపారు. జీ20 సమావేశాలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తూ వస్తున్నామన్న మోదీ.. వైవిధ్యమైన భారతావనిని, శక్తిమంతమైన ప్రజాస్వామ్యాన్ని చూసి జీ20 ప్రతినిధులు చాలా ప్రభావితమయ్యారని తెలిపారు. శ్రీనగర్‌లో జీ-20 సదస్సు జరిగిన తర్వాత పర్యటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు.