ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మరోసారి విమర్శల దాడి చేశారు. మోదీ వంటి అహంకార రాజులు పాత కథల్లో ఉండేవారని విమర్శించారు. దేశాన్ని కాపాడే సైనికుడు కూడా ఒక రైతు బిడ్డేనని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్లోని ముజఫర్నగర్లో కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.
నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు ఎంతగా నిరసిస్తున్నా.. వారి బాధలను ప్రధాని పట్టించుకోవడం లేదని ప్రియాంక అన్నారు. మోదీ రాజకీయాలన్నీ తాను, తన కోటీశ్వరులు స్నేహితుల మీదే ఉంటాయని వ్యాఖ్యానించారు.
"దేశాన్ని కాపాడే సైనికుడు కూడా ఒక రైతు బిడ్డేనని మోదీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ నూతన సాగు చట్టాలతో మీ(రైతుల) హక్కులు అంతమవుతాయి. దేశాన్ని తన ఇద్దరు, ముగ్గురు స్నేహితులకు ఎలా అమ్మేశారో.. అదే విధంగా మిమ్మల్ని, మీ భూములను, మీ ఆదాయాలను అమ్మేస్తారు. దిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్న రైతుల ప్రదేశం.. మోదీ నివాసానికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆయన విదేశాలకు వెళ్లగలరు. కానీ, ఎందుకని లక్షలాది మంది అన్నదాతల వద్దకు వెళ్లలేకపోతున్నారు. వారి కన్నీటిని ఎందుకు తుడవలేకపోతున్నారు. వారి బాధలను ఎందుకు వినిపించుకోవట్లేదు. ఎందుకంటే.. ఆయన రాజకీయాలన్నీ తాను, తన బిలియనీర్ పెట్టుబడిదారుల మిత్రుల కోసమే."