నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 23న కోల్‌కతాలో జరిగే 'పరాక్రమ్ దివస్' వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని ప్రధాని కార్యాలయం తెలిపింది. అనంతరం అసోంలోని శివసాగర్‌లో సుమారు లక్ష మందికి భూ కేటాయింపు ధ్రువీకరణ పత్రాలందించే కార్యక్రమం 'పట్టాస్'లో మోదీ పాల్గొంటారని వెల్లడించింది.
ఆజాద్ హిందు ఫౌజ్ దళపతి, స్వాతంత్య్ర సమర యోధుడికి నివాళిగా ప్రతి ఏటా జనవరి 23ను 'పరాక్రమ్ దివస్'గా జరపాలని కేంద్రం నిర్ణయించింది. స్వాతంత్య్ర సమరంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన 'నేతాజీ' ప్రతిభ యువతలో దేశభక్తిని రగిలిస్తుందని తెలిపింది.
వివిధ కార్యక్రమాలు..
కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌లో జరిగే 'పరాక్రమ్ దివస్' ప్రారంభ వేడుకలకు మోదీ అధ్యక్షత వహించనున్నారు. సుభాష్ చంద్ర బోస్ జీవిత చరిత్రపై ప్రదర్శన, ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను ఆయన ప్రారంభిస్తారు. అలాగే స్మారక నాణాన్ని, తపాలా బిళ్ళను విడుదల చేయనున్నారు. ఇక ఈ వేడుకల్లో బంగాలీ సాంస్కృతిక కార్యక్రమం 'అమ్రా నూతన్ జౌబొనెరి డూట్' ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.