Modi In Chhattisgarh :కాంగ్రెస్ పాలనలో ఛత్తీస్‌గఢ్ పూర్తిగా వెనకబడిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. అవినీతి, నేరాలు బాగా పెరిగిపోయాయని విమర్శించారు. నేరాల సంఖ్యలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ పరస్పరం పోటీ పడుతున్నాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో రూ. 27వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని.. బస్తర్ జిల్లాలో ఏర్పాటు సభలో పాల్గొన్నారు. భూపేశ్ బఘెల్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
దేశంలోని ప్రతి రాష్ట్రం, జిల్లా, గ్రామం అభివృద్ధి చెందినప్పుడే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ కల సాకారమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సామాజిక, డిజిటల్ మౌళిక సదుపాయాలు కల్పించినప్పుడే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని తెలిపారు. అందుకోసమే కేంద్రప్రభుత్వం గత 9 ఏళ్లలో మౌళిక సదుపాయాల కల్పనకు రూ.10లక్షల కోట్లను కేటాయించిందన్నారు.
"కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదేళ్లలో ఛత్తీస్‌గఢ్‌ను చేసిన దుస్థితిని దేశమంతా చూస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల దోపిడీతో ప్రతి ఒక్కరూ విసిగిపోయారు. హత్యల్లో ఛత్తీస్‌గఢ్ ముందు వరుసలో ఉంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మధ్య పోటీ జరుగుతోందని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎక్కడ హత్యలు ఎక్కడ జరుగుతాయి..? ఎక్కడ ఎక్కువగా దోపిడీలు జరుగుతాయి..? ఎక్కడ ఎక్కువగా మహిళలపై అత్యాచారాలు జరుగుతాయి..? ఛత్తీస్‌గఢ్‌లో అభివృద్ధి అంటే పోస్టర్లు లేదా బ్యానర్లలో కనిపిస్తాయి. లేకుంటే కాంగ్రెస్ నేతల ఖజానాలో కనిపిస్తాయి."