Modi In Bhopal : 2024లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందనే.. విపక్షాలు కడుపు మంటతో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. అందుకోసమే ప్రతిపక్షాలు ఏకమై.. సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీయే.. కోట్ల రూపాయల అవినీతి చేసిందని.. ఆర్జేడీ, టీఎంసీ, ఎన్సీపీ.. ఇలా అన్ని పార్టీలు కుంభకోణాలతో నిండిపోయాయని ఆరోపించారు. తాము ఏసీ గదుల్లో కూర్చొని.. ఆదేశాలు జారీ చేసేవాళ్లం కాదంటూ కాంగ్రెస్‌కు పరోక్షంగా చురకలు అంటించారు మోదీ. తాము ప్రజల కోసం.. వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిరంతరం పనిచేస్తామని చెప్పారు. మధ్యప్రదేశ్ భోపాల్‌లో పర్యటించిన ఆయన.. 10 లక్షల మంది బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశమయ్యారు. బీజేపీకి.. బూత్ స్థాయి కార్యకర్తలే అతి పెద్ద బలమని కొనియాడారు. వారే బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చేశారని అభినందించారు. 2047లో స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామన్నారు. ప్రతి గ్రామం బాగుపడితేనే ఇది సాధ్యపడుతుందని.. అందుకోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు.
"ప్రతి బీజేపీ కార్యకర్త.. పార్టీ కంటే దేశమే ముఖ్యమని భావిస్తాడు. అలాంటి 10 లక్షల బూత్ కార్యకర్తలతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ధన్యావాదాలు. ఇలాంటి కార్యక్రమం.. ఏ రాజకీయ పార్టీ చరిత్రలోనూ జరగలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించడంలో మధ్యప్రదేశ్ కీలక పాత్ర పోషించింది."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
'యూసీసీపై ప్రజలను రెచ్చగొడుతున్నారు'
Modi On UCC :యూనిఫామ్ సివిల్ కోడ్‌పై ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు ప్రధాని మోదీ. ఒక దేశం రెండు చట్టాలతో ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. రాజ్యాంగం సైతం సమాన హక్కుల గురించి చెబుతోందని.. సుప్రీం కోర్టు యూసీసీని అమలు చేయాలని కోరిందని చెప్పారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ప్రజలతో ఆడుకుంటున్నాయని దుయ్యబట్టారు.