Modi Ukraine meeting: ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. గత 24 గంటల వ్యవధిలో మూడో భేటీని నిర్వహించారు. సోమవారం జరిగిన మీటింగ్‌కు విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తదితరులు హాజరయ్యారు. ఉక్రెయిన్- రష్యా పరిణామాలను పార్లమెంటరీ ప్యానెల్‌కు వివరించారు శ్రింగ్లా.
మరోవైపు, ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పౌరులను తరలించేందుకు సహకరిస్తామని పొరుగుదేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మోదీ హామీ ఇచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది. 'స్లొవాక్ రిపబ్లిక్, రొమేనియా దేశాల అధినేతలతో మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లోని భారత పౌరులను తరలించడంలో సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు' అని వెల్లడించింది.
రష్యా దాడి నేపథ్యంలో వైద్య సామగ్రితోపాటు మానవతాసాయం అందించాలని ఉక్రెయిన్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆ దేశానికి వైద్య పరికరాలను పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. మానవతా సహాయాన్ని అందించనున్నట్లు చెప్పారు. మంగళవారమే తొలి దఫా సాయాన్ని ఉక్రెయిన్‌కు పంపించనున్నట్లు స్పష్టం చేశారు.
మరోవైపు, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు సహా భారతీయులందరినీ రప్పించే యత్నాల్లో కేంద్రం తలమునకలై ఉంది. సోమవారం ఉదయం జరిగిన సమావేశంలో విద్యార్థులను స్వదేశానికి రప్పించడం సహా నలుగురు కేంద్రమంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పురీ, జోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, వీకే సింగ్‌లను ప్రత్యేక రాయబారులుగా భారత్.. నాలుగు వేర్వేరు దేశాలకు పంపింది.