దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దివాలా తీయిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(rahul gandhi on gdp) విమర్శించారు. గడిచిన 70 ఏళ్లుగా సంపాదించుకున్న జాతి సంపదను మోదీకి సన్నిహితులైన కొంతమంది చేతుల్లో పెడుతున్నారని ఆరోపించారు.
ఉత్తర కేరళలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం ప్రారంభోత్సవంలో వర్చువల్గా పాల్గొన్నారు రాహుల్ గాంధీ. కేంద్రంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రైవేటీకరణకు(privatisation in india) కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదన్న రాహుల్.. దేశానికి వెన్నెముక లాంటి రైల్వే, ఇతర ప్రధాన సంస్థలను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. దేశంలో జీడీపీ పెరుగుదల అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల అనే విధంగా మోదీ ప్రభుత్వం కొత్త అర్థాన్ని తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు.
గడిచిన ఏడేళ్లలో జీఎస్టీ రూపంలో కేంద్రం దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు ఆర్జించిందన్న రాహుల్.. ఆ సంపదనంతా ఎక్కడికి తరలించారని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం అవలంబించే ఆర్థిక విధానాల వల్ల సామాన్యుల ఆదాయం రోజురోజుకు తగ్గుతుంటే.. ప్రధాని సన్నిహితులైన కొంతమంది సంపద మాత్రం పెరుగుతుందని విమర్శించారు.