కేంద్రం దగ్గర తగిన నిధులున్నా కరోనా వాక్సిన్ను ఉచితంగా ఇవ్వటం లేదని బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. "కొవిషీల్డ్ టీకాను కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు సంస్థలకు రూ.600కు అమ్ముకోవచ్చు. ఒకే టీకాకు ఇన్ని ధరలేంటి?" అని తపన్లో నిర్వహించిన టీఎంసీ ప్రచార సభలో మమత ప్రశ్నించారు.
“కరోనా పుణ్యం అంతా ప్రధాని మోదీదే. మోదీ.. మీరు ఏమీ చేయలేదు. కరోనా గురించి ప్రజల్ని అప్రమత్తం చేయలేదు. కానీ కొవిడ్ టీకా కొనాలని ప్రజల్ని కోరుతున్నారు. ఏంటి జోక్ చేస్తున్నారా?”
-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
"కరోనా కట్టడికి మాస్కులు ధరించనవసరంలేదంటోంది ఇజ్రాయెల్. మరి భారత్లో ఏం జరుగుతోంది? టీకా పంపిణీ చేయడానికి రాష్ట్రాలకు కేంద్రం స్వేచ్చనివ్వట్లేదు" అని మమత తీవ్ర స్థాయిలో కేంద్రంపై ధ్వజమెత్తారు.
""బంగాల్ సర్కార్ ఇప్పటివరకు 43 లక్షల మందికి కరోనా టీకా ఇచ్చింది. రోజూ 40వేల నుంచి 50 వేల మందికి రాష్ట్రలో కరోనా టీకాలు వేస్తున్నాం. ఇంకా కోటి టీకాలు కావాలి" అని మమత అన్నారు. మే 5 తర్వాత 18ఏళ్లు పైబడిన వారందరికి తమ ప్రభుత్వం ఉచితంగా కరోనా టీకాను ఇస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి::బంగాల్: కరోనా వేళ జోరుగా ఆరోదశ పోలింగ్