తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ కేబినెట్​లో కొత్త మంత్రిత్వ శాఖ!

కేంద్ర మంత్రివర్గంలో కొత్తగా సహకార శాఖ ఏర్పాటు కానుంది. ఇందుకు ప్రత్యేకంగా ఓ మంత్రిని నియమించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బుధవారం దీనిపై స్పష్టత వస్తుందని వెల్లడించాయి.

By

Published : Jul 6, 2021, 10:49 PM IST

UNION CABINET COOPERATIVE
మోదీ కేబినెట్ కొత్త మంత్రిత్వ శాఖ

కేంద్ర మంత్రివర్గంలో నూతనంగా ఓ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని తెలుస్తోంది. కేంద్ర సహకార శాఖ పేరుతో నూతన మంత్రిత్వ శాఖను ప్రధాని ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఈ శాఖ లక్ష్యమని తెలిపాయి.

'సహకారంతోనే సమృద్ధి' అనే విజన్​ను సాక్షాత్కరించేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో సహకార ఉద్యమానికి బలం చేకూర్చేందుకు న్యాయ, విధాన, పాలనాపరమైన కార్యాచరణను ఈ మంత్రిత్వ శాఖ రూపొందిస్తుందని చెప్పారు. ఈ శాఖకు కొత్త మంత్రిని బుధవారం నియమించే అవకాశం ఉంది.

"ప్రజా ఉద్యమం క్షేత్రస్థాయికి చేరుకునేందుకు నూతన మంత్రిత్వ శాఖ ఉపయోగపడుతుంది. బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తులు ఉన్న ఈ దేశానికి.. సహకార ఆధారిత ఆర్థిక అభివృద్ధి విధానం సరిగ్గా సరిపోతుంది. సహకార సంస్థల సులభతర వాణిజ్యం కోసం ఈ మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది. బహుళ స్థాయి సహకార సంస్థల అభివృద్ధిని సాకారం చేసేందుకు ఈ శాఖ పాటుపడుతుంది."

-ప్రభుత్వ వర్గాలు

సమాజ ఆధారిత అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తుందని.. కొత్త మంత్రిత్వ శాఖ ఆ దిశగా ముందడుగు అని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ద్వారా కేంద్ర బడ్జెట్​లో ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన.. వాస్తవరూపు దాల్చినట్లు అవుతుందని పేర్కొన్నాయి.

ఇదీ చదవండి:బుధవారమే మంత్రివర్గ విస్తరణ- 22 మంది కొత్తవారు!

ABOUT THE AUTHOR

...view details