పార్లమెంటు సంప్రదాయం ప్రకారం నూతన మంత్రుల్ని పరిచయం చేయడానికి తాను ప్రయత్నిస్తుండగా విపక్షం అడ్డుపడడాన్ని ప్రధాని నరేంద్రమోదీ తప్పుపట్టారు. బడుగు బలహీనవర్గాల వారు, రైతు బిడ్డలు, వెనుకబడిన/ గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు, మహిళలు కేంద్ర మంత్రులు కావడాన్ని సభ్యులంతా బల్లలు చరిచి హర్షిస్తారనుకుంటే పరిచయమైనా చేయనివ్వకపోవడమేమిటని ఆవేదనతో ప్రశ్నించారు. అజెండా ప్రకారం వెళ్లాలని ప్రభుత్వం, ప్రజా సమస్యల్ని లేవనెత్తాలని విపక్షం ప్రయత్నించడంతో పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దగా ఎలాంటి కార్యకలాపాలు సాగించకుండానే మంగళవారానికి ఉభయ సభలు వాయిదాపడ్డాయి.
ఇదేం తీరు?
నూతన వ్యవసాయ చట్టాలు, పెట్రో ధరల మంట, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలను లేవనెత్తడానికి విపక్ష సభ్యులు ప్రయత్నించారు. దానిని కాంగ్రెస్ సహా వివిధ పక్షాలకు చెందిన సభ్యులు అడ్డుకున్నారు. 'దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు చెందిన మంత్రుల్ని కేబినెట్‌లోకి తీసుకోవడం కొంతమందికి నచ్చినట్లు లేదు. కొత్త అమాత్యుల పేర్లు వినడానికి, స్వాగతం పలకడానికి వారు సుముఖంగా లేరు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇదేం తీరు? ఇలాంటి వైఖరిని సభలో నేను తొలిసారిగా చూస్తున్నాను' అని ప్రధాని ఆక్షేపించారు. ఉభయ సభల్లోనూ ఒకే తరహా పరిస్థితి కనిపించింది. విపక్షాల నిరసన కొనసాగుతుండడంతో ప్రధాని నూతన మంత్రుల జాబితాను సభకు సమర్పించారు. ప్రధానిని ఇలా అడ్డుకోవడాన్ని తన 24 ఏళ్ల పార్లమెంటరీ అనుభవంలో ఎన్నడూ చూడలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
హుందాతనాన్ని కాపాడాలి: ఓం బిర్లా
ఉప ఎన్నికల్లో కొత్తగా లోక్‌సభ సభ్యులుగా ఎన్నికైన నలుగురి చేత స్పీకర్ ఓం బిర్లా ప్రమాణం చేయించారు. ఆర్థిక పరిస్థితి, ధరల పెరుగుదల తదితర అంశాలపై చర్చకు కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధరి డిమాండ్ చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు. సభ హుందాతనాన్ని కాపాడాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ఇటీవలి కాలంలో కన్నుమూసిన 40 మంది మాజీ ఎంపీలకు లోక్‌సభ నివాళులర్పించింది. ఉద్యమిస్తూ మరణించిన రైతులకూ సంతాపం ప్రకటించాలని కొందరు సభ్యులు డిమాండ్ చేశారు. అవాంతరాల నడుమ సభ పలుమార్లు వాయిదా పడి చివరకు మంగళవారానికి వాయిదా పడింది.
ఫోన్ ట్యాపింగ్ అసాధ్యం
కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు, పాత్రికేయులు సహా మరికొందరి ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయన్న ఆరోపణలపై కేంద్రం లోక్‌సభలో తనంతట తానుగా ప్రకటన చేసింది. ఇదంతా భారత ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ఠ పాల్జేసేందుకు జరుగుతున్న ప్రయత్నంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అభివర్ణించారు. మనకున్న చట్టాల దృష్ట్యా అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం అసాధ్యమని, ఆరోపణల్లో పస లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల తరుణంలో ఆరోపణలు బయటకు రావడం కాకతాళీయమేమీ కాదన్నారు. ఇజ్రాయెల్ కంపెనీ తయారు చేసిన పెగాసస్ స్పైవేర్‌ను భారత ప్రభుత్వం వాడుతున్నదీ లేనిదీ ఆయన స్పష్టం చేయలేదు.