తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Modi Europe Trip: 'ఐరోపాతో బంధం పటిష్ఠం చేసుకుంటాం' - ఐరోపా

Modi Europe Trip: భారత్‌ శాంతి, శ్రేయస్సు పథంలో ఐరోపా భాగస్వామ్యం చాలా కీలకమని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. సహకార స్ఫూర్తితో ఐరోపాతో బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటామని విదేశీ పర్యటనకు ముందు ప్రకటించారు.

Modi Europe Trip
modi europe visit

By

Published : May 2, 2022, 6:24 AM IST

Modi Europe Trip: భారత్‌ శాంతి, శ్రేయస్సుకు ఐరోపా భాగస్వాముల సహకారం కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని.. సోమవారం నుంచి జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌ దేశాలు సందర్శించనున్నారు. ఆయా దేశాధినేతలతో సమావేశం కానున్నారు. ఐరోపా ప్రస్తుతం వివిధ సవాళ్లు, ప్రత్యామ్నాయాలు ఎదుర్కొంటోందని.. ఈ కీలక సమయంలో తాను ఈ ప్రాంతంలో పర్యటించనున్నానని మోదీ పేర్కొన్నారు.

భారత్‌ శాంతి, శ్రేయస్సు పథంలో ఐరోపా భాగస్వామ్యం చాలా కీలకమన్న ప్రధాని.. సహకార స్ఫూర్తితో ఈ ప్రాంతంలోని సహచరులతో తమ బంధాన్ని పటిష్ఠం చేసుకుంటామని తెలిపారు. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ఐరోపా దేశాలు రష్యా వ్యతిరేకంగా సంఘటితమైన సంగతి తెలిసిందే. దీంతో పలు ఐరోపా దేశాలు ఇంధన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మోదీ పర్యటనలో ఈ సమస్యకే అధిక ప్రాధాన్యత ఉంటుందని భారత విదేశాంగ వర్గాలు పేర్కొన్నాయి. జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ఆహ్వానం మేరకు తాను సోమవారం బెర్లిన్‌ చేరుకుంటానని మోదీ తెలిపారు. అక్కడ షోల్జ్‌తో కలిసి భారత్‌-జర్మనీ అంతర్‌ ప్రభుత్వ సంప్రదింపుల (ఐజీసీ) సమావేశంలో మోదీ పాల్గొననున్నారు. అనంతరం భారత్‌, జర్మనీలకు చెందిన ప్రముఖ సీఈవోల రౌండ్‌టేబుల్‌ ఉంటుంది.

మరుసటి రోజు డెన్మార్క్‌ ప్రధాని మెటె ఫెడరిక్సన్‌ ఆహ్వానం మేరకు మోదీ కోపెన్‌హేగన్‌ చేరుకోనున్నారు. అక్కడ రెండో భారత్‌-నార్డిక్‌ సదస్సులో డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌, ఫిన్లాండ్‌, స్వీడన్‌, నార్వే దేశాధినేతలతో భేటీ అవుతారు. 2018లో జరిగిన తొలి భారత్‌-నార్డిక్‌ సదస్సులో తీసుకున్న నిర్ణయాల ప్రగతిని ఈ సందర్భంగా సమీక్షించనున్నారు. డెన్మార్క్‌ నుంచి భారత్‌ తిరిగి వస్తూ పారిస్‌లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ని ప్రధాని కలవనున్నారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి విజయం సాధించినందుకు మెక్రాన్‌ను అభినందించనున్నారు.

ఇతరులను నష్టపరిచి భారత్‌ ఎదగాలనుకోదు:భారత్‌ ఇతరులను నష్టపరిచి ఎదగాలనుకోదని, వసుధైక కుటుంబ భావనతోనే నిరంతరం పనిచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఆయన కెనడాలోని మార్గామ్‌లో సనాతన్‌ మందిర్‌ కల్చరల్‌ సెంటర్‌ ప్రాంగణంలో సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశం అమృత్‌ మహోత్సవాలు జరుపుకొంటున్న వేళ.. పటేల్‌ విగ్రహాన్ని కెనడాలో ఆవిష్కరించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆధునిక భారత నిర్మాణం కోసం స్వాతంత్య్రయోధులు ఎన్నో స్వప్నాలు కన్నారని, వాటిని నిజం చేయాల్సిన అవసరం అందరిపైనా ఉందని పిలుపునిచ్చారు. నవ భారత సంకల్పానికి అందరూ పూనుకోవాలని అన్నారు.

భారత్‌ ఎప్పుడూ తన స్వార్థాన్ని చూసుకోలేదని, సర్వమానవాళి హితానికే ప్రాధాన్యతిస్తూ వచ్చిందని ప్రధాని నొక్కి వక్కాణించారు. వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్థి లాంటి అంశాల్లో భారత్‌ తన గొంతును ప్రపంచం కోసం వినిపిస్తూనే ఉందని తెలిపారు. "మన శ్రమ కేవలం మన కోసం కాదు. మన ప్రగతితో సర్వమానవాళి శ్రేయస్సు ముడిపడి ఉంది" అని మోదీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:నా టార్గెట్ అదే.. అందుకు సైన్యాన్ని సిద్ధం చేస్తా: ఆర్మీ కొత్త చీఫ్

ABOUT THE AUTHOR

...view details