తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీకి చదువు విలువ తెలియదు'.. ప్రధాని విద్యార్హతపై సిసోదియా విమర్శలు

ప్రధాని మోదీ విద్యార్హతలపై ఆ​ప్​ మరోసారి విరుచుకుపడింది. విద్యార్హత లేని ప్రధాని దేశానికి ప్రమాదకరమని ఆ పార్టీ మాజీ మంత్రి మనీశ్​ సిసోదియా అన్నారు. మోదీ విద్య ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేరన్నారు. ఈ మేరకు జైలు నుంచి ప్రజలకు ఓ లేఖ రాశారు.

modi education qualification aap
modi education qualification aap

By

Published : Apr 7, 2023, 11:38 AM IST

Updated : Apr 7, 2023, 12:18 PM IST

ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రధాని నరేంద్రమోదీ విద్యార్హతలపై దాడి ఉద్ధృతం చేసింది. దేశాభివృద్ధి కోసం విద్యావంతుడైన ప్రధాని కావాలని.. జైల్లో ఉన్న ఆప్‌ మాజీ మంత్రి మనీశ్‌ సిసోదియా డిమాండ్‌ చేశారు. విద్య ప్రాముఖ్యాన్ని ప్రధాని మోదీ అర్థం చేసుకోలేరన్నారు. ఈ మేరకు సిసోదియా జైలు నుంచి ప్రజలకు ఓ బహిరంగలేఖ రాశారు. ఈ లేఖను దిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. తగిన విద్యార్హత లేని ప్రధాని వల్ల.. దేశానికి చాలా ప్రమాదమని సిసోదియా ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా 60 వేల పాఠశాలలు మూతపడ్డాయని పేర్కొన్నారు. అందువల్ల.. దేశం అభివృద్ధి పథంలో సాగాలంటే విద్యావంతుడైన ప్రధాని అవసరమన్నారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. ఫిబ్రవరి 26న మనీశ్‌ సిసోదియాను సీబీఐ అరెస్ట్ చేసింది.

ఆప్ మాజీ మంత్రి మనీశ్​ సిసోదియా రాసిన లేఖ

"రోజురోజుకు శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచం ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ గురించి మాట్లాడుకుంటోంది. ఈ సమయంలో డ్రైనేజీ కాలువలో పైపు పెట్టి మురికి గ్యాస్​తో ఆహారం తయారు చేయొచ్చని ప్రధాని చెబుతుంటే నా గుండె తరుక్కుపోతోంది. నిజంగా మురిగి గ్యాస్ నుంచి ఆహారం వండచ్చా? లేదు. మేఘాల చాటున ఎగురుతున్న విమానాన్ని రాడార్​ గుర్తించలేదని ప్రధాని మోదీ అన్నప్పుడు ప్రపంచమంతా నవ్వింది. స్కూల్​, కాలేజీ విద్యార్థులు ఆయనను వెక్కిరిస్తున్నారు"
--మనీశ్‌ సిసోదియా, దిల్లీ మాజీ మంత్రి

ఈ తరం యువత ఆశయంతో ఉన్నారని.. వాళ్లు ఏదైనా సాధించాలని అవకాశాల కోసం వెతుకుతున్నారని మనీశ్​ సిసోదియా అన్నారు. ప్రపంచాన్ని గెలవాలని.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అద్భుతాలు సృష్టించాలనుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి ఆకాంక్షలతో ముందుకు సాగుతున్న యువత ఆశయాలను.. తక్కువ చదువుకున్న ప్రధాని నెరవేర్చగలరా అని సిసోదియా ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ విద్యార్హత వివాదం..
అరవింద్​ కేజ్రీవాల్ 2016లో..ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు చూపించాలని కేంద్ర సమాచార కమిషన్​ ఛైర్మన్​కు లేఖ రాశారు. సమాచార హక్కు చట్టం ప్రకారం మోదీ విద్యార్హతలకు సంబంధించిన వివరాలు వెల్లడించాలని​ కోరారు. ఈ లేఖపై స్పందించిన అప్పటి కేంద్ర సమాచార కమిషన్​ ఛైర్మన్​ ఎమ్​ శ్రీధర్ ఆచార్యులు.. మోదీ విద్యార్హతలకు సంబంధించిన రికార్డులను కేజ్రీవాల్‌కు ఇవ్వాలని గుజరాత్, దిల్లీ విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై గుజరాత్ యూనివర్సిటీ అభ్యంతరం వ్యక్తం చేసి.. గుజరాత్​ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్ర సమాచార కమిషన్​ ఆదేశాలను పక్కనబెడుతూ.. కేజ్రీవాల్​కు రూ. 25 వేల జరిమానా విధించింది. ఆ జరిమానాను నాలుగు వారాల్లోగా గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది.

Last Updated : Apr 7, 2023, 12:18 PM IST

ABOUT THE AUTHOR

...view details