Birbhum Violence: 'బంగాల్ బీర్భుమ్ జిల్లా రాంపుర్హట్ ప్రాంతంలో జరిగిన హత్యాకాండ' అతిక్రూరమైన ఘటనగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. దర్యాప్తునకు అవసరమైతే సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. కోల్కతాలో విక్టోరియా మెమోరియల్లో గ్యాలరీ ప్రారంభోత్సానికి వర్చువల్గా హాజరైన మోదీ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఈ దారుణానికి పాల్పడిన వారిని శిక్షించేందుకు బంగాల్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. ఇటువంటి ఘటనలకు పాల్పడిన వారిని అసలు క్షమించకూడదని బంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నిందితులు పట్టుబడేందుకు కేంద్రం అన్ని విధాల సహకరించేందుకు సిద్ధంగా ఉంది."
-నరేంద్ర మోదీ, ప్రధాని
కఠిన చర్యలు తీసుకుంటాం: రాంపుర్హట్ ప్రాంతంలో సీఎం మమతా బెనర్జీ గురువారం పర్యటించనున్నారు. బోగ్తుయ్ గ్రామంలో జరిగిన ఈ దారుణంపై మమత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది భాజపా, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న కుట్ర అని పేర్కొన్నారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
"నిజానికి నేను ఈ రోజు పర్యటించాల్సి ఉంది. కానీ పలు రాజకీయ పార్టీలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. వారు తిరిగివచ్చేందుకు కాస్త సమయం పడుతుంది. వారు ఉండగా నేను అక్కడ పర్యటించను. నాకు గొడవపడాలని లేదు. అందుకే రేపు పర్యటిస్తాను. పెట్రోల్ ధరలు పెంపు నుంచి దృష్టి మరల్చేందుకు ఈ ఘటనపై వార్తలు ఇవ్వాలని మీడియాను భాజపా కోరింది."