కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకున్నారు. నేరపూరిత పరువునష్టం కేసులో సూరత్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాహుల్.. మంగళవారం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును అత్యవసరంగా విచారణ చేపట్టాలని రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది పీఎస్ చంపానేరి బుధవారం హైకోర్టును కోరారు. ఇందుకు గుజరాత్ హైకోర్టు అంగీకరించింది. దీంతో ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ గీతా గోపీ.. తాను ఈ కేసును విచారించబోనని స్పష్టం చేశారు. అయితే, ఈ పిటిషన్పై బుధవారం అత్యవసర విచారణకు కోరవచ్చని హైకోర్టు తనకు అనుమతి ఇచ్చిందని.. కానీ విచారణకు కోరగా న్యాయమూర్తి తప్పుకున్నట్లు చెప్పారని చంపానేరి వెల్లడించారు. క్రిమినల్ రివ్యూ పిటిషన్లపై జస్టిస్ గీతా బెంచ్ విచారిస్తున్నందునే.. ఆమె వద్దకు వెళ్లామని ఆయన వివరించారు.
మరోవైపు మంగళవారమే సూరత్ సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు రాహుల్ గాంధీ. అంతకుముందు ఈ కేసుపై విచారణ జరిపిన సూరత్ కోర్టు.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేసేందుకు వీలుగా 30 రోజుల గడువు ఇచ్చింది. అప్పటి వరకు బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ కేసులో తనపై విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను సూరత్ సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న తిరస్కరించింది.